Multibagger Meter: 2022లో వివిధ సమస్యలు స్టాక్ మార్కెట్లను అష్ట దిగ్బంధనం చేయడంతో, సూచీలు ముందుకు అడుగు వేయడానికి బాగా ఇబ్బంది పడ్డాయి. మల్టీబ్యాగర్ మీటర్ కూడా గత సంవత్సరం నెమ్మదిగా కదిలింది, 86 స్టాక్స్ మాత్రమే జాక్‌పాట్ కొట్టగలిగాయి. 2021 సంవత్సరం డెలివరీ చేసిన మల్టీబ్యాగర్లతో పోలిస్తే, 2022లో వచ్చినవి నాలుగింట ఒక వంతు (పావు వంతు) మాత్రమే.
రూ. 500 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) ఉన్న మల్టీబ్యాగర్లను లెక్కలోకి తీసుకుంటే, 86 స్టాక్స్ 2022 క్యాలెండర్ సంవత్సరంలో పెట్టుబడిదారుల సంపదను కనీసం రెట్టింపు చేశాయి. 2020లో 135 & 2021లో 336 మల్టీ బ్యాగర్లు అవతరించాయి. కోవిడ్ పూర్వ సంవత్సరాలైన 2018 & 2019 క్యాలెండర్ సంవత్సరాల్లో కేవలం 19 మల్టీబ్యాగర్ స్టాక్స్ లెక్క తేలాయి.
గత 10 సంవత్సరాల కాలంలో చూస్తే, 2014 ఉత్తమంగా కనిపిస్తుంది. ఆ సంవత్సరంలో జాక్‌పాట్ అందించిన స్టాక్స్ సంఖ్య 344.
2022 సంవత్సరంలో, 3 స్క్రిప్స్ (రూ. 500 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉన్నవి) 1,000% కంటే ఎక్కువ లాభాలు ఇచ్చాయి. వ్యక్తిగత సంరక్షణ & ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయించే స్మాల్ క్యాప్ రజనీష్ వెల్‌నెస్ (Rajnish Wellness) దాదాపు 20- బ్యాగర్‌గా (1965% రిటర్న్స్) మారింది. SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (SEL Manufacturing Company) 1,550% ర్యాలీ చేయగా, SG ఫిన్‌సెర్వ్ (SG Finserve) 1,088% రాబడి అందించింది.
ఇతర టాప్ మల్టీ-బ్యాగర్స్:
జెన్సోల్ ఇంజినీరింగ్ (Gensol Engineering) -884%
శాంతి ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ (Shanti Educational Initiatives) - 640%
CWD - 625%
నాలెడ్జ్ మెరైన్ & ఇంజినీరింగ్ వర్క్స్ (Knowledge Marine & Engineering Works) 609%
మెగెల్లానిక్ క్లౌడ్ (Magellanic Cloud) - 516%
అక్షిత కాటన్ (Axita Cotton) - 515%
శంకర్ లాల్ రాంపాల్ డై కెమ్ (Shankar Lal Rampal Dye-Chem) - 403%
క్రెస్సాండా సొల్యూషన్స్ (Cressanda Solutions) - 313%
ఈ జాబితాలో 3 అదానీ గ్రూప్ కౌంటర్లు - అదానీ పవర్ (200%), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (126%), మరియు అదానీ టోటల్ గ్యాస్ (116%) కూడా ఉన్నాయి.
2023లో మరిన్ని మల్టీ-బ్యాగర్స్‌ను చూడొచ్చా?
ఈ ఏడాది డిసెంబర్ 1న తాకిన ఆల్ టైమ్ హై లెవెల్స్‌కు సెన్సెక్స్ & నిఫ్టీ కేవలం 4% దూరంలోనే ఉన్నాయి. దీంతో, 2022 లాగా 2023 సంవత్సరం కూడా స్టాక్ పికర్స్ మార్కెట్‌గా మారుతుందని చాలా మంది ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. అయితే, రిటర్న్స్ గతంలో ఉన్నంత భారీగా ఉండకపోవచ్చని చెబుతున్నారు.
'గ్రీడ్ అండ్ ఫియర్ ఇండికేటర్' (greed and fear indicator) ఇప్పుడు గ్రీడ్ లెవల్స్‌కి చాలా దగ్గరగా ఉంది, ఇది రాబోయే 12 నెలల్లో మిడ్ క్యాప్ స్టాక్స్‌కు బాగా ఉపయోగపడుతుందని యాంబిట్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ చెబుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.