AP Stampade Politics :  గుంటూరులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్న ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటపై రాజకీయ దుమారం రేగుతోంది. ఓ వైపు ఈ ఘటనకు చంద్రబాబు కారణం అంటూ వైఎస్ఆర్‌సీపీ విమర్శలు చేస్తోంది. మరో వైపు తెలుగుదేశం పార్టీ మాత్రం వరుసగా జరుగుతున్న తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వం తీరుపైనే విమర్శలు చేస్తున్నారు. 





దుర్ఘటన జరిగిన 5 నిమిషాల్లో మంత్రులు అంతా కట్టగట్టుకొని మాట్లాడడం, సిద్ధంగా కూర్చొని ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ట్రెండ్ చేయడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గుల పనే అని అర్థమవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు వశ్లేషిస్తున్నారు. 





గుంటూరు తొక్కిసలాటలో "చనిపోలేదు,చంపేశారు" అని జనం అనుకుంటున్నారని.. అయితే ఇది ఎవరి పని? స్వార్థం కోసం, పగ-ప్రతీకారం కోసం హత్యలకు వెనుకాడని రక్తపిశాచి ఏలుబడిలో ఇంకెవరు చేస్తారు ఈ పని? అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తోంది. 






చంద్రన్న కానుక కార్యక్రమాన్ని ఒక ఎన్నారై చేపట్టారని, పోలీసుల అనుమతితోనే కార్యక్రమాన్ని నిర్వహించారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రకటించారు.  పోలీసులు ముందుగానే వచ్చి స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. పోలీసులు పరిశీలించిన తర్వాత కూడా ఈ దుర్ఘటన ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఆ ముగ్గురు మహిళలు చనిపోయారా?  లేక చంపేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ నేతలు కలిసి చంపేశారని ఆరోపించారు. చంద్రబాబు సభలకు జనాలు పోటెత్తుతుండటాన్ని ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు. ఈ పనులను వైసీపీ స్లీపర్ సెల్స్ చేస్తున్నాయని ఆరోపించారు.