తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.. ఇందులో భాగంగా వేకువజామున 12:05 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.. అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు శ్రీనివాసుడి దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కావడంతో భక్తి శ్రద్దలతో భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ స్వామి వారి దర్శన భాగ్యం పొంది పునీతులు అవుతున్నారు.. అయితే వైకుంఠ ఏకాదశు పర్వదినం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి స్వర్ణరధంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులను కాటాక్షించారు.
వైకుంఠ ఏకాదశి నాడు బంగారు రధంపై ఊరేగుతున్న స్వామి అమ్మవార్లను చూసి భక్తులు తన్మయత్వం పొందుతూ కర్పూర నీరాజనాలు పలికారు..అంతే కాకుండా తిరుమాఢ వీధులు గోవింద నామస్మరణలతో మారుమ్రోగాయి.. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణరధంపై విహరిస్తున్న శ్రీ మలయప్ప స్వామి వారిని దర్శిస్తే చాలు మనోరధాలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
వైకుంఠ ద్వారం నుంచి దర్శనాలు
వైకుంఠ వాసుడైన శ్రీనివాసుడి అత్యంత ప్రీతికరమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి.. వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. అందుకే వైకుంఠ ద్వార దర్శనం గుండా శ్రీవారిని దర్శించుకునేందుకు ధనవంతుల నుండి కటిక పేద వరకూ తిరుమలకు క్యూ కడుతారు.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు వేకువజామున 12:05 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం అయ్యింది.. ముందుగా ప్రముఖులకు దర్శనం కల్పించిన టిటిడి, అటుతర్వాత ఉదయం ఆరు గంటల నుండి సామాన్య భక్తులకు వైకుంఠ దర్శనం కల్పిస్తుంది..ఆదివారం రోజున 53,101 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. 23,843 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 3.48 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు.
దేవుని గడప లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం
తిరుమల తొలి గడప దేవుని గడప లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం వైభవంగా ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 5 గంటలకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించారు. వైకుంఠ దర్శనం కోసం భారీ ఎత్తున భక్తులు తెల్లవారు జామున 3 గంటల నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై భక్తులకు శ్రీనివాసుడు దర్శనం ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు, పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు.
వైకుంఠంను తలపించేలా శ్రీవారి ఆలయంలో పుష్పాలంకరణ
వైకుంఠ ఏకాదశికి తిరుమల పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా టిటిడి అధికారులు అలంకరించారు.. శ్రీవారి ఆలయ మహద్వార గోపురంతో పాటు ప్రాకారం, ధ్వజస్తంభం, ఉత్తర ద్వారంలో ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేశారు. ఆలయంలో ఐదు టన్నులు, వెలుపల ఐదు టన్నుల సంప్రదాయ పుష్పాలతో అలంకరణ చేశారు.. మరో లక్ష కట్ ఫ్లవర్స్‌తో ఆలయంలోని ధ్వజస్తంభాన్ని, బలిపీఠం, ఉత్తర ద్వారాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దారు.. మహద్వారం గోపురానికి శంఖు, చక్ర, నామాల నడుమ పుష్పాలతో తయారు చేసిన మహావిష్ణువు, లక్ష్మీదేవి దేవతామూర్తుల కటౌట్ ఏర్పాటు చేశారు.. ముఖ్యమైన ప్రాంతాల్లోని పుష్పాలంకరణలు కనువిందు చేస్తున్నాయి.. ఆలయం ముందు ఏర్పాటు చేసిన 'వైకుంఠ మండపం' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. శ్రీ మహా విష్ణువుతో పాటు అష్టలక్ష్మీ, దశావతారాల ప్రతిమలను మండపంలో ఏర్పాటు చేశారు.. 30 వేల కట్‌ఫ్లవర్స్‌తో పాటు టన్ను సంప్రదాయ పుష్పాలతో మండపాన్ని అలంకరించారు.. శ్రీ మహా విష్ణువుతో పాటు అష్టలక్ష్మీ, దశావతారాల ప్రతిమలను మండపంలో ఏర్పాటు చేశారు.. 30 వేల కట్ ఫ్లవర్స్‌తో పాటు టన్ను సంప్రదాయ పుష్పాలతో మండపాన్ని అలంకరించారు.. ఆలయం ముందు గొల్ల మండపం వద్ద ఏర్పాటు చేసిన శ్రీవారు, గ్లోబు విద్యుత్ ప్రతిమలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.