Sudha Murthy in Pongala Celebrations:


వావ్..ఏం సింప్లిసిటీ..


ఇన్‌ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధా మూర్తి గురించి పరిచయమే అక్కర్లేదు. రచయితగా, వక్తగా, సామాజిక సేవకురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతకు మించి ఆమె సింప్లిసిటీ అందరినీ ఆకట్టుకుంటుంది. పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించినా..ఆమె మాత్రం ఎప్పుడూ సింపుల్‌గానే కనిపిస్తారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడి వాళ్లతో ఇట్టే కలిసిపోతారు. కేరళలోని Pongala వేడుకల్లో పాల్గొన్న సుధామూర్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయంలో ఓ సామాన్యురాలిగా కింద కూర్చుని భక్తులందరికీ పొంగళిని వడ్డించారు. వేలాది మంది భక్తుల సమక్షంలో ఆమె కాసేపు ప్రసాదం వితరణ చేశారు. ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణిగా, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తయ్యగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతో చరిష్మా ఉన్న సుధామూర్తి ఇంత సింపుల్‌గా కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వేడుకల్లో పాల్గొనడంపై స్పందించిన సుధామూర్తి...పొంగళ వేడుకల గురించి మాట్లాడారు. ఇది నారీశక్తికి నిదర్శనమని చెప్పారు. ఈ వేడుకల్లో తనతో పాటు పాల్గొన్న మహిళలతో చాలా సాధారణంగా మాట్లాడారు సుధామూర్తి. ప్రసాదం వండడంలోనూ సాయం చేశారు. 


"ఎంతో మంది మహిళలు కలిసి ఈ వేడుకలు చేసుకుంటున్నారు. కులం, ప్రాంతం, పేద, ధనిక అన్న తేడాలు ఇక్కడేవీ లేవు. అంతా ఒక్కటే అనే సందేశమిచ్చేదే ఈ వేడుక. ఒకరినొకరు మళ్లీ కలుసుకునే అవకాశం లేకపోయినా సరే పరస్పరం సాయం చేసుకోవాలనేదే ఈ పండుగ అంతరార్థం. ఇక్కడ నినాదాల గొడవ లేదు. ఎవరూ ఎవరికి ఆదేశాలివ్వడం లేదు. అందరూ సమానమేనన్న ఈ భావన నాకెంతో నచ్చింది"


- సుధామూర్తి, ఇన్‌ఫోసిస్ ఛైర్‌పర్సన్