Sudha Murthy Nominated to Rajya Sabha: మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఇన్‌ఫోసిస్ ఇన్‌ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్‌పర్సన్, రచయిత్రి సుధామూర్తిని బీజేపీ తరపున రాజ్యసభకి నామినేట్ చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇందుకు ఆమోదం తెలిపినట్టు ప్రకటించారు. ఈ మేరకు X వేదికగా పోస్ట్ పెట్టారు. 






ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ..


ఈ సందర్భంగా సుధామూర్తిపై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని. విద్యారంగంలోనే కాకుండా ఆమె సమాజానికీ ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. రాజ్యసభలో ఆమె ప్రాతినిధ్యం వహించడం నారీశక్తికి నిదర్శనం అని స్పష్టం చేశారు.


"రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుధామూర్తిని రాజ్యసభకి నామినేట్ చేశారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్యారంగంలో ఆమె చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. రాజ్యసభలో ఆమె ప్రాతినిధ్యం నారీశక్తికి నిదర్శనం. దేశ సమర్థతని, మహిళల శక్తిని పెంచాలన్న మా లక్ష్యానికి ఇదో గొప్ప ఉదాహరణ"


- ప్రధాని నరేంద్ర మోదీ


రాష్ట్రపతి రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేస్తారు. కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవా రంగాలకు చెందిన ప్రముఖులను నేరుగా నామినేట్ చేసేందుకు అవకాశముంటుంది. ఈ సారి సుధామూర్తికి ఈ అవకాశమిచ్చారు. ఇన్‌ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణిగానే కాకుండా ఆమెకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1950లో ఆగస్టు 19వ తేదీన కర్ణాటకలోని షిగ్గావ్‌లో జన్మించారు సుధామూర్తి. 2006లో భారత ప్రభుత్వం ఆమెని పద్మశ్రీతో సత్కరించింది. గతేడాది ఆమె సామాజిక సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్ పురస్కారమూ లభించింది. చాలా సాదాసీదాగా కనిపించడమే ఆమెని ప్రత్యేకంగా నిలబెట్టింది. టెల్కోలో ఇంజనీర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. కరోనా సమయంలో ఆమె దాతృత్వ గుణం అందరి ప్రశంసలు అందుకుంది. కేవలం సామాజిక సేవకురాలిగానే కాకుండా...రచయిత్రిగానూ సమాజంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంగ్లీష్‌తో పాటు కన్నడలోనూ రచనలు చేశారు. ఆమె పుస్తకాలు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి.


విమెన్స్ డే గిఫ్ట్..


రాజ్యసభకు నామినేట్ చేయడంపై సుధామూర్తి స్పందించారు. విమెన్స్ డే గిఫ్ట్‌గా భావిస్తున్నట్టు చెప్పారు. ఇది తన బాధ్యతని మరింత పెంచిందని వెల్లడించారు. 


"మహిళా దినోత్సవానికి నాకు దక్కిన అతి పెద్ద గిఫ్ట్‌ ఇది. దేశం కోసం పని చేయడానికి ఇచ్చిన కొత్త బాధ్యతగా భావిస్తున్నాను"


- సుధామూర్తి, రాజ్యసభ ఎంపీ 


Also Read: బెంగళూరు బాంబు పేలుడు కేసు - అనుమానిత ఉగ్రవాది అరెస్ట్ - ఐసిస్‌తో లింక్‌లు?