Sudan Violence:
మూడు రోజులకుపైగా యుద్ధం..
సూడాన్‌లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య యుద్ధం జరుగుతోంది. మూడు రోజుల క్రితం మొదలైన ఈ ఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ పరిస్థితులు దిగజారుతున్నాయి. ఇంకా దారుణం ఏంటంటే...ఈ అల్లర్లలో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ యుద్ధం కారణంగా అక్కడి భారతీయులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటున్నారు. భారత ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడి ఇండియన్స్‌కి రక్షణ కల్పించే ఏర్పాట్లు చేస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియాతో ఇప్పటికే చర్చలు జరిపింది. ఈ రెండు దేశాలూ భారతీయులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి. అటు అమెరికా, బ్రిటన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి. సౌదీ, UAE మాత్రం భారత్‌కు మద్దతుగా నిలిచాయి. సూడాన్‌లోని ఇండియన్ ఎంబసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. భారతీయులెవరూ బయటకు రావద్దని సూచించింది. శాంతియుత వాతావరణానికి సహకరించాలని కోరింది. ఇప్పటికే ఈ సమస్య పరిష్కారానికి ఢిల్లీలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. భారతీయుల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. వాట్సాప్ గ్రూప్‌ల్లోనూ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటోంది. ప్రస్తుతానికి సూడాన్‌లో హైటెన్షన్ ఉందని, రోడ్లపైనే యుద్ధం జరుగుతోందని చెబుతోంది అక్కడి మీడియా.
ట్విటర్ వార్
సూడాన్‌లో ఆ యుద్ధం జరుగుతంటే ట్విటర్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ప్రశ్నిస్తూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓ ట్వీట్ చేశారు. కర్ణాటకకు చెందిన 31 మంది పౌరులు సూడాన్‌లో చిక్కుకుపోయారని, వాళ్లను సురక్షితంగా తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. చాలా రోజులుగా అక్కడ వాళ్లు ఆహారం లేకుండా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిపై జైశంకర్ ట్విటర్ వేదికగానే స్పందించారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యం అంటూ మండి పడ్డారు. దీనిపై రాజకీయాలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పలు దేశాలతో చర్చిస్తున్నట్టు స్పష్టం చేశారు. సిద్దరామయ్య ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
"మీ ట్వీట్ నన్ను షాక్‌కి గురి చేసింది. అక్కడ ఎంతో మంది భారతీయులు ప్రాణాపాయంలో ఉన్నారు. దీన్ని రాజకీయం చేయకండి. ఏప్రిల్ 14న ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్కడి ఎంబసీతో ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తూనే ఉన్నాం"
- ఎస్ జైశంకర్, విదేశాంగ మంత్రి