ఎంతో సంతోషంగా ఓ జంట తమకు పుట్టబోయేది పాపనో, బాబునో తెలుసుకునే జండర్ రివీల్ పార్టీ చేసుకుంటున్నారు. కానీ ఆ పార్టీలో అందరినీ షాక్ గురిచేసేలా విషాదకర ఘటన చోటుచేసుకుంది. పార్టీలో జెండర్ రివీల్ చేసేందుకు ఉపయోగించిన స్టంట్ ప్లేన్ ఉన్నట్టుండి కుప్పకూలింది. విమానం నడుపుతున్న పైలట్ మృతిచెందారు. ఈ విషాదకర ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ (ట్విట్టర్)లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.
వీడియో ప్రకారం.. దంపతులు తమ సన్నిహితులతో కలిసి చాలా ఉత్సాహంగా పార్టీ జరుపుకుంటున్నారు. తమకు పుట్టబోయే బిడ్డ ఎవరో తెలుసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఓ బేబీ అని పెద్ద అక్షరాలు అరేంజ్ చేసిన దగ్గర భార్యభర్తలు చేతులు పట్టుకుని నిలబడి ఉన్నారు. పైపర్ పీఏ-25 పవనీ ప్లేన్ వారి మీదుగా ఎగురుతూ వెళ్లూ గులాబి రంగును వెదజల్లింది. అంతా ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. విమానం మాత్రం వారి మీదుగా వెళ్లిన కొన్ని క్షణాల్లోనే అదుపు తప్పి కుప్పకూలింది. అతిథులంతా చూస్తుండగా వారి ముందు విమానం రెక్కలు విరిగి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడిన పైలట్‌ను ఆస్పత్రికి తరలించగా ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన మెక్సికోలోని సినాలోవా కౌంటీలో జరిగింది.
స్టంట్ ప్లేన్ నడుపుతున్న పైలట్‌ను 32 ఏళ్ల లూయిస్ ఏంజెల్ ఎన్ గా గుర్తించారు. ప్రమాదంలో విమానం అదుపుతప్పిన వెంటనే తొలుత విమానం ఎడమవైపు రెక్క విడిపోయి కింద పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ మధ్య జండర్ రివీల్ పార్టీలు మరీ ఓవర్‌గా చేస్తున్నారని, ఇలాంటి వాటి వల్ల ఏటా ఎన్నో ప్రాణాలు పోతున్నాయని యూజర్లు ట్వీట్లు చేశారు. ఒక్క నిమిషం ప్లేన్ క్రాష్ అవ్వడం చూసి అందరూ అరుస్తున్నారేమో అనుకున్నా.. వాళ్లు అటువైపు చూడనే లేదు అంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు. జండర్ రివీల్ పార్టీల్లో ఇలా జరగడం ఇదేమీ తొలిసారి కాదని, ఇంతకుముందు పలు రకాల ఘటనలు జరిగాయంటూ మరొకరు అన్నారు. ఇంత ఎక్స్‌ట్రీమ్‌గా పార్టీలు అవసరమా, సింపుల్‌గా చేసుకోవచ్చు కదా అని మరొకరు అభిప్రాయపడ్డారు.