నూజివీడు ట్రిపుల్ ఐటీ(Nujiveedu Triple IT)లో ఐదువేల మంది విద్యార్థులు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు. నాసిరకం భోజనం పెడతున్నారని 5వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత రెండు నెలలుగా నాసిరకం భోజనం పెడుతున్నా ఉన్నతస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం  చేశారు. నాసిరకం భోజనం తినడంతో కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. అర్థ ఆకలితోనే బాధపడతున్నారు. నాణ్యమైన ఆహారం పెట్టాలని పలుమార్లు ఆర్జీయూ కేటీ అధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని అధికారల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ ఆందోళనలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


ఉడకని అన్నం, రుచిపచి లేని పప్పు కూర, నీళ్ల రసం, గట్టి ఇడ్లీ, కుళ్లిన కోడి గుడ్లు, నాసిరకం చికెన్ పెట్టడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అశుభ్ర వాతావరణంలో మెస్‌లు కొనసాగిస్తున్నా.. ట్రిపుల్ ఐటీ అధికారులు పర్యవేక్షించడం లేదని విద్యార్థులు అంటున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మానేసిన విద్యార్థులు నూజివీడు ట్రిపుల్ ఐటీలో బైఠాయించి ఆందోళనకు దిగారు.నాణ్యమైన ఆహారం అందించే వరకు ఆందోళనలను విరమించబోమని విద్యార్థులు డిమాండ్ చేశారు.


భోజనంలో నాణ్యత  పాటించకుండా వడ్డించడం సరికాదన్నారు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థులు ఆందోళన చెందారు. గత కొన్ని రోజుల నుంచి భోజనం బాగోలేదంటూ తమగోడు వినిపించిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆలోచించారు. కొన్నిసార్లు భోజనం చేయకుండా తరగతులకు హాజరవుతున్నామని దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నారు వెల్లడించారు. భోజనం బాగో లేకపోవడంతో బయటకు వెళ్లి తింటున్నామని దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని ఆరోపించారు. తక్షణమే భోజన ఏజెన్సీని తొలగించి కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. 


ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ...భోజనం అసలు బాగోవడంలేదని, పెరుగులో పిండి కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కూడా తినేందుకు లేకుండా భోజనం తయారు చేస్తున్నట్లు విద్యార్థులు వాపోయారు. తమకు నాలుగు ఐదు కూరలతో భోజనాలు వద్దని వండే ఒక కూర అయినా తాము తినేలా ఉండాలని విద్యార్థుల విన్నవిస్తున్నారు. ఉదయం పూటైతే గారెలు గోడకు కొట్టినా కూడా పగలని విధంగా పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల ఆందోళనను చూసి త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. 


విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండేలా చూస్తానని త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సరైన భోజనం పెట్టకపోతే మెస్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తానే స్వయంగా ఒక పది రోజులు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని  త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మెస్ నిర్వహకులు వచ్చి తనను కలవాలని నూజివీడు త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. త్రిబుల్ ఐటీ డైరెక్టర్ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు. తమ సమస్యను, ఇబ్బందులను  పరిష్కరించిన త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.