Stock Market Closing On 10 September 2024: ఈ రోజు (మంగళవారం, 10 సెప్టెంబర్‌ 2024) ట్రేడింగ్ సెషన్ భారత స్టాక్ మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఇచ్చిన బూస్ట్‌తో భారత మార్కెట్‌లో బుల్స్‌ బల ప్రదర్శన చేశారు. మార్కెట్‌లో ఈ రోజు నిఖార్సైన బలం కనిపించింది. 


షేర్‌ మార్కెట్‌లో ఈ రోజు కనిపించిన వృద్ధికి అతి పెద్ద కాంట్రిబ్యూటర్లు - ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, ఎనర్జీ స్టాక్స్. నేటి సెషన్‌లో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో కూడా భారీగా కొనుగోళ్లు జరిగాయి. మార్కెట్ ముగిసే సమయానికి BSE సెన్సెక్స్ 361 పాయింట్ల జంప్‌తో 81,921 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో 25,041 వద్ద క్లోజయ్యాయి. ఈ పెరుగుదతో నిఫ్టీ మళ్లీ 25,000 మార్క్‌ను విజయవంతంగా దాటింది.


ఈ రోజు సెన్సెక్స్‌ 209.18 పాయింట్లు లేదా 0.26 శాతం మంచి లాభంతో 81,768 దగ్గర (BSE Sensex Opening Today); నిఫ్టీ 63 పాయింట్లు లేదా 0.25 శాతం పెరిగి 24,999 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ఓపెన్‌ అయ్యాయి. అయితే, ప్రారంభం నుంచే మార్కెట్‌ పడడం మొదలైంది, ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి బుల్స్‌ ఛార్జ్‌ తీసుకున్నాయి, మార్కెట్‌ ఏకపక్షంగా పెరగడం మొదలైంది. ఈ బుల్‌ రన్‌ దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు కంటిన్యూ అయింది. చివరి గంటలో, ప్రాఫిట్‌ బుకింగ్స్‌ & ఇతర కారణాలతో మార్కెట్లు కొంత తగ్గాయి.


సెన్సెక్స్30 ప్యాక్‌లో 22 స్టాక్స్ లాభాలతో ముగియగా, 8 నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ50 ప్యాక్‌లో 33 స్టాక్స్ లాభాలు సాధించగా, 17 స్టాక్స్‌ నష్టాలు మూటగట్టుకున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ 2.15 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2.10 శాతం, టెక్ మహీంద్రా 1.92 శాతం, ఎన్‌టీపీసీ 1.73 శాతం, పవర్ గ్రిడ్ 1.70 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.40 శాతం, టీసీఎస్ 1.21 శాతం, టైటన్ 1.16 శాతం, అదానీ పోర్ట్స్‌ 1.19 శాతం చొప్పున పెరిగాయి. పతనమైన వాటిలో... బజాజ్ ఫిన్‌సర్వ్ 1.77 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.45 శాతం, హెచ్‌యుఎల్ 0.81 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.68 శాతం క్షీణించాయి.


రూ.3.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద 
భారత స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు అద్భుతమైన పెరుగుదల కారణంగా, పెట్టుబడిదారుల సంపదలో భారీ జంప్ కనిపించింది. బీఎస్‌ఇలో లిస్టయిన స్టాక్స్‌ మార్కెట్ క్యాప్ (market capitalization of indian stock market) గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.460.17 లక్షల కోట్లుగా ఉండగా, ఈ రోజు రూ.463.66 లక్షల కోట్ల వద్ద ముగిసింది. దీంతో, నేటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.3.49 లక్షల కోట్లు పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.