సీఈవో పిలిచినా ఆఫీస్‌కు వెళ్లిన ఉద్యోగులు 


కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో చాలానే మార్పులొచ్చాయి. ముఖ్యంగా జాబ్ మార్కెట్‌ సరళి పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకూ కొన్ని సంస్థలకే పరిమితమైన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ని అందరికీ పరిచయం చేసింది కొవిడ్ సంక్షోభం. చిన్న చిన్న సంస్థల నుంచి బడా కంపెనీల వరకూ అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్‌ వైపే మొగ్గు చూపాయి. దాదాపు రెండున్నరేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే మళ్లీ కంపెనీలన్నీ ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ విధానానికి మారుతున్నాయి. ముఖ్యమైన ఉద్యోగులందరినీ ఆఫీస్‌లకు రప్పించుకుంటున్నాయి పలు సంస్థలు. కొన్ని కంపెనీల్లో మాత్రం ఉద్యోగులు యాజమాన్యాల మాట అసలు పట్టించుకోవటం లేదు. ఆఫీస్‌కి రావాలని కాల్స్, మెయిల్స్ చేస్తున్నా ఇంటి నుంచి పని చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. చాలా కంపెనీలకు ఇది తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలు సంస్థలు, ఉద్యోగులు ఆఫీస్‌లకు తిరిగి వచ్చేందుకు కాంప్లిమెంటరీ గిఫ్ట్‌లతో పాటు మరికొన్ని ఆఫర్లు ఇస్తున్నాయి. ఇంత చేసినా రెస్పాన్స్ మాత్రం తక్కువగానే ఉంటోంది. స్టార్‌బక్స్ సంస్థ కూడా ఇప్పుడిదే సమస్య ఎదుర్కొంటోంది. స్వయంగా ఈ సంస్థ సీఈవో హోవర్డ్ షల్జ్ "దయచేసి ఆఫీస్‌కు రండి" అంటూ ఉద్యోగులను వేడుకుంటున్నారు. 


ప్రొడక్టివిటీ తగ్గిపోతోందన్నా ఉద్యోగులు రావట్లేదు-స్టార్‌ బక్స్ అధినేత హోవర్డ్ షల్జ్


అందరి సీఈవోల్లాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు స్టార్‌ బక్స్ అధినేత హోవర్డ్ షల్జ్. అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో తనను తాను ఓల్డ్ స్కూల్ పర్సన్‌గా చెప్పుకున్నారు హోవర్డ్. ఉద్యోగులను ఆఫీస్‌కు రప్పించేందుకు చాలా బతిమాలానని చెప్పారు. మోకాళ్ల మీద పడి అడగమన్నా అడుగుతానని, వాళ్లు ఇంకేం చేయమన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు హోవర్డ్. వాళ్లు వెనక్కి వస్తే చాలని తన బాధను చెప్పుకున్నారు. ఇంత చేసినా ఎంప్లాయిస్ ఆఫీస్‌కు రావటం లేదని అసంతృప్తితో ఉన్నారు హోవర్డ్. కంపెనీ ప్రొడక్టివిటీ తగ్గిపోతోందని, ఇది చెప్పినా ఉద్యోగులు అర్థం చేసుకోవటం లేదని బాధ పడుతున్నారు. నిజానికి హోవర్డ్ ఒక్కరే కాదు. పలు సంస్థలు సీఈవోలు ఇదే బాధలు పడుతున్నారు. ఇన్నాళ్లు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌కి అలవాటు పడిన ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించటం లేదు. ఫలితంగా..సంస్థల అధినేతలకు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కావట్లేదు. అయినా వదలకుండా తమ ప్రయత్నాలేవో తాము చేసుకుంటున్నారు. హైయర్ లెవల్‌లో ఉన్న ఉద్యోగులు మాత్రమే ఆఫీస్‌కు వస్తున్నారు. మిగతా వాళ్లంతా ఇంటికే పరిమితమవుతున్నారు. మరీ ఒత్తిడి తీసుకొస్తే రిజైన్ చేసి...వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఇచ్చే సంస్థలకు వెళ్లిపోతున్నారు.