జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. పంథా చౌక్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఇందులో ఒకరికి జైషే మహ్మద్‌తో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు.







ఏం జరిగింది?


పంథా చౌక్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే భద్రతాదళాలపై ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఇది ఎన్‌కౌంటర్‌కు దారి తీసింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు, మరో సీఆర్‌పీఎఫ్ జవానుకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.  వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.


ఆరుగురు హతం..


అనంతనాగ్​ జిల్లాలోని నౌగామ్​ షాహ్​బాద్​, కుల్గాం జిల్లాల్లో నిన్న జరిగిన రెండు ఎన్​కౌంటర్లలో మొత్తం ఆరుగురు ముష్కరులను మట్టుబెట్టాయి బలగాలు. ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతాల్లో మొత్తం నాలుగు ఏకే 47, రెండు ఎం4 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్​ ఐజీపీ తెలిపారు. ఆ రెండు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ గాలింపు చేపడుతున్నట్లు ఐజీపీ పేర్కొన్నారు.


రెండు ఘటనల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారని, జవాన్ల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కశ్మీర్ ఐజీపీ తెలిపారు.


Also Read: Omicron Cases India: దేశంలో కొత్తగా 16,764 మందికి కరోనా.. 1200 దాటిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య


Also Read: Covaxin: పిల్లలపై 'కొవాగ్జిన్‌' ఉత్తమ ఫలితాలు.. తుది దశ ఫలితాలు వెల్లడించిన భారత్ బయోటెక్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.