పూటగడవని పరిస్థితి వారిది. ఉన్నచోట ఉపాధి లేక .. పొట్టచేతపట్టి వారంతా పరాయి ప్రాంతానికి వెళ్లేవారు. కానీ అనుకోని విపత్తు ముంచుకురావడంతో బతుకుంటే గంజైనా తాగొచ్చనే ఒకే ఒక్క ఆలోచనతో తెగించి ఉవ్వెత్తున ఎగిసిపడే అలలపై సుదీర్ఘసాగరాన్నిచేధించుకుంటూ సొంతూర్లకు చేరుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ... ఏటా ఈపాటికి బోటెక్కి వేటకు వెళ్లే వారి భవిష్యత్తు ఏంటే వారికే అర్ధంకాని పరిస్థితి. సిక్కోలు ఉద్ధానం వలస.. 


వలసకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే శ్రీకాకుళం జిల్లాలో ఉద్ధాన ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండో కోనసీమగా, ప్రకృతి పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ప్రాంతమే అయినప్పటికీ ఇక్కడ పనిచేసుకునేందుకు ఉపాధి లేక వేలాది మంది యువత, మత్స్యకారులు పొట్టకూటికోసం పరాయి రాష్ట్రాలకు వలస పోతుంటారు. ముఖ్యంగా 193 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం కలిగి ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఉద్ధానం పరిధిలో మత్స్యకారులు ఎక్కువగా నివసిస్తున్నారు. అయితే పక్కనే సముద్రం ఉన్నా ఇక్కడ వేట చేసుకునేందుకు సరైన అవకాశాలు లేకపోవడంతో మత్స్యకారులకు పూటగడవని పరిస్థితి. ఇక బంగాళాఖాతంలో ఏ చిన్న అల్పపీడనంఏర్పడినా... ఏ చిన్న ప్రకృతి విపత్తు వచ్చినా ఏడాదిలో ఎక్కువ రోజులు ఇళ్లకే పరిమితమై మత్స్యకారులు పస్తులుండాల్సి వస్తోంది. దీంతో ఉన్నచోట ఉపాధి లేక బ్రతుకుతెరువు కోసం వలస బాట పడుతున్నారు.


స్థానికంగా చేపల వేటకు అవకాశాలు లేకపోవడంతో ఏటా ఉద్ధానం పరిధిలోని సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని వేల మంది మత్స్యకారులు ఉపాధిని వెతుక్కుంటూ చెన్నై వలస పోతున్నారు. ఐతే ఏడాదికోసారి వేట విరామం సమంయలో సొంతూళ్లకు వచ్చి అయినవాళ్లందరితో , కుటుంబాలతో ఓ నెలరోజుల పాటు గడిపి తిరిగి చెన్నై వెళ్లిపోయే మత్స్యకారులను కరోనా కమ్మేసింది. మహమ్మారి విజృంభణను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించడంతో వేలమంది చెన్నైలో లాక్ అయిపోయారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు మూసేశారు. రైలు, రోడ్డు, విమాన మార్గాలను సైతం పూర్తిగా రద్దు చేసేయడంతో తినడానికి తిండికూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక అక్కడే ఉంటే తమ ప్రాణాలు కరోనాకు బలైపోవడం ఖాయమనుకుని అప్పటి వరకూ కూడబెట్టుకున్న డబ్బుతో సొంతంగా పడవలు కొనుక్కుని మరీ ప్రాణాలకు తెగించి సముద్రమార్గం ద్వారా సొంతూర్లకు చేరుకున్నారు. 


ఉపాధి కోసం వెళ్లి మాల్దీవుల్లో చిక్కుకున్న ఐదుగురు ఇచ్చాపురం వాసులకు గత మూడు నెలలుగా వాళ్లకి ఎటువంటి జీతం ఇవ్వకపోగా భోజనం కూడా పెట్టకుండా వాళ్లకి భారత్ వెళ్లిపోతామన్న వాళ్లు వీసా, పాస్ పోర్ట్స్ తీసుకొని వాళ్లను భారత్ కూడా పంపించకుండా వారిని చాలా ఇబ్బందులు పెడుతున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. వాళ్లు దగ్గర రీఛార్జ్ చేయించుకోడానికి కూడా డబ్బులు లేవు ఇచ్చాపురానికి చెందిన ఆనంద్ ఇన్‌స్టిస్ట్యూట్  ద్వారా వాళ్లు మాల్దీవులకు వెళ్లారు. ఆ ఇన్‌స్టిట్యూట్ కు ఓ వ్యక్తి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫీసుకి తాళం వేసి పరారీలో ఉన్నాడు.


ఉన్న ఊరిలో చేసేందుకు పనిలేదు. డిగ్రీ పట్టా ఉండడంతో ఉపాధి పథకం పనులకు వెళ్లలేని పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ పోషణకు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఏదో ఒక ఉద్యోగం చేసుకుని నాలుగు పైసలు వెనకేసు కోవాలనుకున్న బలీయమైన కోరిక.. ఇవే వారికి చిక్కులు తెచ్చిపెడుతోంది. అప్పోసొప్పో చేసి, ఉన్న ఆస్తిని అమ్మి ఏజెంట్లు, బ్రోకర్లు చేతిలో పెట్టివిదేశాలకు వెళితే అక్కడ మోసపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేక తిరిగి స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొనడం శ్రీకాకుళం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది. కొద్ది రోజుల కిందట సంతబొమ్మాళి ప్రాంతానికి చెందిన వారు తాము మోసపోయామని టెక్కలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, తాజాగా మాల్దీవుల్లో చిక్కుకున్నాం.. సొంతూరికి తీసుకెళ్లేలా చూడాలని ఉద్దానం ప్రాంతానికి చెందిన సామాజిక మాధ్యమాల్లో చూడాలంటూ రోదిస్తున్నారు. దీన్ని చూసిన ఆయా కుటుంబాలు కలత చెందుతున్నాయి.
తాజాగా ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, పలాస, సంతబొమ్మాళి మండలాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు గత ఏడాది మాల్దీవుల్లో వివిధ పనుల నిమిత్తం వెళ్లారు. వీరంతా ఇచ్ఛాపురం, సంతబొమ్మాళికి చెందిన బ్రోకర్ల ద్వారా విశాఖలోని ఏజెంట్ను పట్టుకుని మాల్దీవులు వెళ్లారు. కంపెనీ యాజమాన్యం వారికి పనులు కల్పించింది. వారి పాసుపోర్టు, వీసాను యాజమాన్యం తీసేసుకుంది. కొద్ది నెలలు పాటు పనులు బాగానే కల్పించడం, జీతాలు సమయానికి ఇవ్వడంతో జీవనం సాఫీగానే సాగింది. కొద్ది నెలల తరువాత నుంచి ఆ కంపెనీలో పనులు లేకపోవడంతో వీరికి పనుల్లేకుండా పోయింది. వేతనాలు కూడా యాజమాన్యం ఇవ్వడం మానేసింది. దీంతో వీరంతా రోడ్డున పడ్డారు. అక్కడ భాష రాక, తమ వేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, స్వదేశానికి వద్దామంటే పాస్ పోర్టులను తిరిగి కంపెనీ యాజమాన్యం ఇవ్వకపోవడంతో నానాకష్టాలుపడుతున్నారు. ఏజెంట్లు, బ్రోకర్లకు ఫోన్ చేసిన పట్టించుకోవడంతో చేయాలో తెలియక అల్లాడిపోతున్నారు. సోషల్ మీడియాలో వీడియో పోస్టు కన్నీరుమున్నీరవుతున్నారు.


నాలుగు నెలలుగా పనుల్లేవు... కుటుంబ సభ్యులకు విషయం తెలిసి 
మాల్దీవుల నుంచి జిల్లావాసులు ఒక వీడియోను సామాజిక మాధ్యమంలో విడుదల చేశారు. మాల్దీవుల్లో చిక్కుకున్నాం.. నాలుగునెలలుగా పనులు లేవు. గతంలో చేసిన పనులకు వేతనం ఇవ్వలేదు. ఇవ్వకపోయినా పర్వాలేదు. పాస్పోర్టు ఇస్తే ఇంటికి వెళ్లిపోతామన్న తమ గోడును కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం పూర్ణామార్కెట్ ప్రాంతం పండావీధిలో ఉన్న ఓ ఇన్స్టిట్యూట్ ద్వారా మాల్దీవులకు గత ఏడాది ఏప్రిల్లో చేరుకున్నామన్నారు. ఇచ్ఛాపురానికి చెందిన శంకర్, సుభాషలో, పూండికి చెందిన శివ వీరికి సహకరించారంటున్నారు. ఒక్కొక్కరికి నుంచి దళారులు రూ. లక్ష చొప్పున తీసుకున్నారని చెప్పారు. తాము తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని, ఒక్క పూట తింటే మరో పూట అర్ధాకలితో అలమటిస్తున్నామని, ఏజెంట్లు, దళారులకు ఫోన్ చేసినా స్పందించడంలేదని మాల్దీవుల్లో చిక్కుకున్నశ్రీకాకుళం జిల్లావాసులు వాపోతున్నారు. పాస్ పోర్టులు ఇప్పిస్తే ఇండియాకు తిరిగి వస్తామని వేడుకుంటున్నారు.


సిక్కోలుకు రప్పిస్తానని ఎంపీ భరోసా 
కవిటి ప్రాంతంలోని నెలవంక గ్రామానికి చెందిన కొందరు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన ఎంపీ రామ్మోహన్ నాయుడుకు మాల్దీవుల్లో చిక్కుకున్న సిక్కోలు జిల్లావాసుల పరిస్థితిని వివరించారు. దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందించి తన ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు.


ఎరవేసి.. లక్షలు గుంజేసి.. 
విదేశాల్లో ఉద్యోగం, వేలల్లో జీతం, పాసుపోర్టు నుంచి కంపెనీకి చేరవేసినంత వరకు మాదే బాధ్యత అంటూ విశాఖ జిల్లాకు చెందిన కొందరు ఏజెంట్లు, బ్రోకర్లు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురుని తమ వలలో వేసుకుంటున్నారు. ఉద్దానం ప్రాంతానికి చెందిన నిరుద్యోగులను ఈ ఏజెంట్లు ఎరచూపుతూ వారి నుంచి లక్షల్లో గుంజేస్తున్నారు. కంపెనీతో సంబంధం లేకుండా ఏజెంట్ను నమ్ముకుని పరాయి దేశం వెళ్లిన యువకులు మోసపోతునే ఉన్నారు. చిక్కుకున్న వారిలో ఎంతోమందిని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరిగి స్వదేశానికి రప్పించారు. పోలీసులు జోక్యం చేసుకుని దళారులు, ఏజెంట్లపై కఠినమైన సెక్షన్లతో శిక్షలు వేస్తే రానున్న రోజుల్లో కొంతలో కొంతైన జిల్లావాసులు విదేశాలకు వెళ్లి మోసపోకుండా కట్టడి చేయవచ్చని పలువురు కోరుతున్నారు.