Madakasira News: ఉన్నతాధికారులు, మంత్రుల పర్యనటకు ఖర్చులు పెట్టుకోవాలని కాబట్టే లంచాలు తీసుకుంటున్నామని అంటున్నారు శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathya Sai ) మడకశిర తహసిల్దార్. ఒక్కొక్కరు వస్తే లక్షల్లో ఖర్చుపెట్టాల్సి వస్తుందని వాటికి తమ జీతాలు సరిపోవని... జేబుల్లోంచి తీసే పరిస్థితి కూడా లేదని ముష్రా వలీ తేల్చేశారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకోవాడనికి ఆయన చెప్పిన కారణాలతో కూడిన వీడియో ఇప్పుడు వైరల్‌(Viralగా అవుతోంది. 


లంచానికి స్వీట్ కోటింగ్


మడకశిర తహసిల్దార్ కార్యాలయానికి వచ్చేవాళ్లు ఎవరైనా లంచాలు తీసుకురావాల్సింది. ఆ లంచాలను తహసిల్దార్ ముష్రా వలీ చాలా అందమైన కారణాలతో తీసుకుంటారు. ఈ మధ్యే అలానే ఓ భూ సమస్య పరిష్కారం కోసం రైతు వచ్చారు. ఆయనకి కూడా ముష్రావలీ లంచం డిమాండ్ చేశారు. ఎందుకు లంచం ఇవ్వాలని రైతు ప్రశ్నించారు. 


ఖర్చులు ఉంటాయి బాబు


లంచాలు ఎందుకు తీసుకుంటారని రైతు అడిగిన ప్రశ్నకు ముష్రా వలీ చెప్పిన కారణాలు వింటే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు వారి ఖర్చులు ఎవరు భరించాలని ప్రశ్నిస్తున్నారు ముష్రా వలీ. కార్యాలయం నిర్వహణ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయని అంటున్నారు. అందుకే లంచాలు తీసుకోక తప్పడం లేదని కవర్ చేసుకుంటున్నారు. 


మంత్రి టూర్ ఖర్చు ఇంకా రాలేదు


అక్కడితో ఆగిపోని ముష్రా వలీ ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రముఖుల టూర్‌ల సంగతి వారి తిండి మెనూ గురించి వివరించారు. తాను మడకశిరలో జాయిన్ అయిన కొత్తలో మంత్రి వచ్చారని అప్పుడు తనకు లక్షకుపైగా ఖర్చు అయిందని బోరుమన్నారు. ఆ ఖర్చులో ఒక్కపైసా కూడా ప్రభుత్వం నుంచి రాలేదని... లంచాలు తీసుకోకుంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని అంటున్నారు. 


మెనూ చూస్తే మతిపోతుంది


అంతేకాదు రీసెంట్‌గా వచ్చిన ఉన్నతాధికారి టూర్‌ గురించి కూడా ముష్రా వలీ వివరించారు. ఈనెల 13వ తేదీ టెక్స్‌టైల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత వచ్చారని ఆమె కోసం భారీగా ఖర్చు చేసినట్టు తెలిపారు. ఆమె భోజనం ఖర్చే లక్షల్లో అయిందని అన్నారు. ఆమె వచ్చినప్పుడు ఉన్నతాధికారుల నుంచి భోనానికి మెనూ వచ్చిందని చదివి వినిపించారు. ఆ ఫుడ్‌ ఏదీ మడకశిరలో దొరకదని హిందూపురం నుంచి తెప్పించానని వివరించారు. 


కొన్ని చెప్పుకోలేం బాస్


ఇలా ఎవరు వచ్చినా తాము ఖర్చులు భరించాల్సి ఉంటుందని వాటిని తమ జేబులోంచి పెట్టుకోవడం కుదరదని అంటున్నారు ముష్రా వలీ. అందుకే లంచాలు తీసుకోవాల్సి ఉంటుందని సర్ది చెప్పారు. శరీరంలో చాలా పుండ్లు ఉంటాయని కొన్ని మాత్రమే బయటకు కనిపిస్తాయని కొన్ని కనిపంచవని... చూపిస్తే కనిపిస్తాయన్నారు. అలాంటిదే తమ పరిస్థితి అని వివరించారు. 


అక్కడ ఉన్న వారు ఎవరు తహసిల్దార్ ముష్రా వలీ మాట్లాడన మాటలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతే విషయం ఉన్నతాధికారుల వద్దకు చేరింది. రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి బహిర్గతమైంది. దీంతో ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు విచారణ చేపట్‌టారు. అనంతరం తహసిల్దార్ ముష్రా వలీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.