అధ్యక్షుడు రాజపక్స ఇంట్లోకి ఆందోళనకారులు
శ్రీలంకలో సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు తగ్గిపోయి, సరుకులు దిగుమతులు నిలిచిపోయి, పడరాని కష్టాలు పడుతోంది ఈ ద్వీప దేశం. దేశానికి ఈ పరిస్థితి తీసుకొచ్చిన గొటబయ రాజపక్స వెంటనే అధికారం నుంచి తప్పుకోవాలని దాదాపు మూడు నెలలుగా అక్కడి ప్రజలు నిరసనలు చేపడుతూనే ఉన్నారు. రాజపక్స ప్రజల కంట పడకుండా ఇంట్లో దాక్కున్నారు. అందుకే ప్రజలు రోడ్లపైన కాకుండా నేరుగా ఆయన ఇంటికే వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పోలీసులు వచ్చి చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నా..ఏ మాత్రం భయపడటం లేదు నిరసనకారులు. ఇప్పట్లో ఈ ఆగ్రహం చల్లారేలా లేదని, గొటబయ రాజపక్స అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. పరిస్థితుల్నిఅదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే వారిపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. ఒక్కసారిగా నిరసనకారులు రాజపక్స ఇంట్లోకి చొరబడ్డారు
ఆయన నివాసంలోకి చొరబడ్డ ఆందోళనకారులు పూల్‌లో స్విమ్మింగ్ చేశారు. వంటగదిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఆహార పదార్థాలు ఆరగించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధ్యక్షుడు రాజపక్సను ఓ రహస్య ప్రాంతానికి సైన్యం తరలించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను అక్కడి మీడియా ప్రసారం చేసింది. కొద్దినెలలుగా శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పట్లో ఈ ఆపద నుంచి బయటపడేలా లేదు. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడం వల్ల ఆ దేశ అవసరాలకు సరిపడే ఇంధనాన్నీ అక్కడి సర్కార్ కొనుగోలు చేయలేకపోతోంది.