శ్రీలంకకు అన్ని విధాలా సహకరిస్తాం..


ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఎప్పటికీ అండగా ఉంటామని భారత్ మరోసారి స్పష్టం చేసింది. శ్రీలంక సుస్థిరతను సాధించేందుకు అవసరమైన సహకారపం అందిస్తామని వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా సాయం అందిస్తామని చెప్పింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడేందుకు మద్దతునిస్తామని హామీ ఇచ్చింది. శ్రీలంకలోని హైకమిషన్ ఆఫ్ ఇండియా ఇదే విషయాన్ని ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. ఈ ద్వీప దేశానికి భారత్ ఎప్పటి నుంచో అండగా నిలబడుతూనే ఉంది. ఆహార కొరతను తీర్చేందుకు వేల టన్నుల ఆహార ధాన్యాలు అందించింది. దాదాపు 4 బిలియన్ డాలర్ల విలువైన రుణాలు, సరుకులు అందించింది. ఆర్థిక తోడ్పాటుని కొనసాగిస్తూ వస్తోంది. నూనెలు, ఆహార ధాన్యాలు, మెడిసిన్స్, ఫర్టిలైజర్స్ సహా పిల్లలకు సంబంధించిన నిత్యావసరాలనూ సరఫరా చేసింది. ఇకపైన కూడా ఈ "సాయం" కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నోసార్లు భారత్‌....శ్రీలంక సంక్షోభంపై స్పందించింది. 
అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నామని, చేతనైంది చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చింది. ఇప్పుడు శ్రీలంకలో కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికైన నేపథ్యంలో మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.









 


ఇదే తొలిసారి..


దేశాన్ని దివాలా తీయించి మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స విదేశాలకు పారిపోవడంతో కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. నిజానికి గొటబాయ 2024 నవంబరు వరకు పదవిలో ఉండాల్సింది. ఆయన రాజీనామా చేయడంతో కొత్తగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే ఆ గడువు వరకు పదవిలో కొనసాగుతారు. లంక పార్లమెంటు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడం గత 44 ఏళ్లలో ఇదే తొలిసారి. పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులున్నారు. ఇందులో 223 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. మాల్దీవుల నుంచి సింగపూర్ వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన పార్లమెంటుకు రాజీనామా లేఖను పంపారు. దీంతో కొత్త అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకుంది. గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్నే ఎంపీలు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.


Also Read: Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడంటే అంత ఈజీ కాదు-ఈ సవాళ్లు దాటితే కానీ గౌరవం దక్కదు