Sri Lanka Crisis: 


2.9 బిలియన్ డాలర్ల సాయం..


ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న శ్రీలంకకు కాస్త ఊరటనిచ్చే కబురు వినిపించింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)సంస్థ. 2.9 బిలియన్ అమెరికన్ డాలర్ల రుణం అందించేందుకు అంగీకరించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. దాదాపు 1948 నుంచి ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి ఈ దేశాన్ని. రెండేళ్లుగా ఇవి తీవ్రమయ్యాయి. విదేశీ కరెన్సీ నిల్వలు అడుగంటడం వల్ల పరిస్థితి మరీ దిగజారింది. ఈ కష్ట కాలంలో IMF ఆదుకుంటామని ప్రకటించటం ఆ  దేశానికి ఉపశమనం కలిగించింది. IMF స్టాఫ్, శ్రీలంక అధికారుల
మధ్య సంప్రదింపులు జరిగాక...ఈ నిర్ణయం వెలువడింది. 48 నెలల పాటు సరిపడ Extended Fund Facility (EFF) కింద 2.9 బిలియన్ డాలర్లు అందించేందుకు ఆమోదించింది. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించటం సహా...రుణాలు చెల్లిస్తూనే...ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా ఈ నిధులు అందిస్తున్నట్టు IMF తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచే IMFతో సంప్రదింపులు జరుపుతోంది శ్రీలంక. రుణం అందించాలని కోరుతోంది. అయితే...ఈ విషయమై లీగల్ అడ్వైజర్లను నియమించుకోవాలని...ఎన్ని నిధులు అవసరమవుతాయో చెప్పాలని IMFసూచించింది. 






కొన్ని సూచనలు కూడా..


పన్నుల్లోనూ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని IMF సూచించింది. కాస్ట్ రికవరీ ఆధారంగా పెట్రోల్, విద్యుత్ ఛార్జ్‌లు నిర్ణయించాలని తెలిపింది. పేదలకు సాయం అందించే విధంగా సోషల్ స్పెండింగ్‌ పెంచాలని చెప్పింది. యాంటీ కరప్షన్‌ వ్యవస్థనూ బలోపేతం చేసుకోవాలని తెలిపింది. అంతకు ముందు గొటబయ రాజపక్స అధ్యక్షుడిగా ఉండగా...ఇప్పుడా స్థానంలో విక్రమసింఘే వచ్చారు. 
ఆర్థిక మంత్రి బాధ్యతలనూ తానే చూసుకుంటున్నారు. శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. అంతకు ముందు ప్రధానిగా ఉన్నప్పుడే ఆయనను అంగీకరించని లంకేయులు..అధ్యక్ష పదవిలో ఉండటాన్ని అసలు ఒప్పుకోవటం లేదు. తీవ్రంగా నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆయన ఇంటికి నిప్పుపెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసనల్లో భాగంగానే ఆందోళన కారులు ఓ డిమాండ్‌ను వినిపిస్తున్నారు. "ఇంటికి వెళ్లిపో" అంటూ రణిల్ విక్రమసింఘేను ఉద్దేశిస్తూ నినదిస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. కొంత కాలంగా దీనిపై అక్కడ వేడి రాజుకుంటోంది. 
మొత్తానికి ఈ అంశంపై స్పందించారు రణిల్ విక్రమసింఘే. తనను ఇంటికి వెళ్లిపోమనటంలో అసలు అర్థమే లేదని కొట్టి పారేశారు. "నేను ఇంటికి వెళ్లిపోవాలని కొందరు బెదిరిస్తున్నారు. వాళ్లందరికీ నేనొక్కటే చెబుతున్నా. వెళ్లటానికి నాకు ఓ ఇల్లంటూ లేదు. అందుకే ఇలా డిమాండ్ చేయటం మానుకోండి" అని బదులిచ్చారు. ఇలాంటి డిమాండ్‌లతో సమయం వృథా చేసుకోకూడదని, దాని బదులు కాల్చేసిన తన ఇంటిని రీబిల్డ్ చేయాలని ఆందోళనకారులకు సూచించారు. "ఇల్లే లేని వ్యక్తిని, ఇంటికి వెళ్లిపోమని అరవటంలో ఎలాంటి అర్థమూ లేదు" అని అంటున్నారు రణిల్ విక్రమసింఘే. 


Also Read: Vidya Vasula Aham First Look: డిఫరెంట్ గా ‘విద్య వాసుల అహం’ ఫస్ట్ లుక్ - ఫిదా అవుతున్న ప్రేక్షకులు


Also Read: Portugal Health Minister: పోర్చుగల్‌లో ఇండియన్ టూరిస్ట్ మృతి, రిజైన్ చేసిన ఆ దేశ ఆరోగ్య మంత్రి