SpiceJet Employee Slaps CISF Cop: స్పైస్‌జెట్ ఎంప్లాయ్ CISF జవాన్‌పై చేయి చేసుకోవడం సంచలనమైంది. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిన సమయంలోనే స్పైస్‌జెట్ ఉద్యోగి ఉన్నట్టుండి జవాన్ చెంప ఛెళ్లుమనిపించింది. సెక్యూరిటీ స్క్రీనింగ్ విషయంలో ఈ గొడవ జరిగింది. ఈ ఘటనపై స్పందించిన స్పైస్‌జెట్..ఆ మహిళా ఉద్యోగినే సమర్థించింది. లైంగికంగా వేధించినందుకే ఆమె చేయి చేసుకుందని స్పష్టం చేసింది. SpiceJet లో ఫుడ్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న మహిళ తెల్లవారుజామున 4 గంటలకు అందరి ఉద్యోగులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చింది. ఆ సమయంలోనే అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గిరిరాజ్ ప్రసాద్ వాళ్లను అడ్డగించాడు. ఆ గేట్ నుంచి లోపలికి వచ్చేందుకు అనుమతి లేదని వారించాడు. స్క్రీనింగ్ చేసిన తరవాతే లోపలికి అనుమతి ఇస్తానని చెప్పాడు. అయితే...స్క్రీనింగ్ వద్ద మహిళా పోలీసులు ఎవరూ లేరు. గిరిరాజ్ ప్రసాద్ వెంటనే మహిళా పోలీసులు రావాలని కబురు పంపాడు. ఈలోగా స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగికి, ఆ పోలీస్‌కి మధ్య వాగ్వాదం మొదలైంది. మహిళా పోలీసులు వచ్చినా ఇద్దరి మధ్యా గొడవ ఆగలేదు. ఆ తరవాత ఆమె ఆవేశంతో జవాన్‌పై చేయి చేసుకుంది. ఈ ఘటను తీవ్రంగా పరిగణించిన CISF వెంటనే ఆ మహిళా ఉద్యోగిపై కేసు నమోదు చేసింది.
అయితే..ఈ విషయంలో మహిళా ఉద్యోగి వాదన మరోలా ఉంది. లేడీ పోలీసులు లేనప్పుడు చెకింగ్ ఎలా చేస్తారని వాదించింది. అందుకే స్క్రీనింగ్‌కి తాను ఒప్పుకోలేదని తేల్చి చెప్పింది. అంతే కాదు. ఆ పోలీస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని చెప్పింది. డ్యూటీ అయిపోయాక ఇంటికి రావాలని అసభ్యకరంగా మాట్లాడాడని ఆరోపించింది. ఈ ఘటనపై స్పైస్‌జెట్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
"గేట్‌లో నుంచి లోపలికి వచ్చే సమయంలో CISF జవాన్ ఆమెని అడ్డుకున్నాడు. కచ్చితంగా స్క్రీనింగ్ జరగాల్సిందేనని చెప్పాడు. అక్కడ మహిళా పోలీసులు ఎవరూ అందుబాటులో లేరు. అయినా స్క్రీనింగ్‌కి పట్టుబట్టాడు. అక్కడితో ఆగకుండా మా ఉద్యోగితో అసభ్యకరంగా మాట్లాడాడు. పని అయిపోయిన తరవాత ఇంటికి రావాలని అడిగాడు"
- స్పైస్‌జెట్ ప్రతినిధి