TGSRTC Digital Payments In City Buses: 'టిక్కెట్టుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టరుకు సహకరించగలరు' ఇది ప్రతీ ఆర్టీసీ బస్సులోనూ కనిపించే సూచన. చాలాసార్లు చిల్లర లేక అటు ప్రయాణికులు, ఇటు కండక్టర్స్ సైతం ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు వాగ్వాదాలు జరగడం సైతం మనం చూశాం. ఇకపై ప్రయాణికులకు ఆ బాధలు ఉండవు. ప్రయాణికుల సౌలభ్యం దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC).. పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో నగదు రహిత డిజిటల్ చెల్లింపుల విధానం (Digital Payments) అమల్లోకి తీసుకురానుంది. ఆగస్ట్ కల్లా సిటీ సర్వీసుల్లో, సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆధునిక సాంకేతికత విస్తరించే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో కండక్టర్లకు 10 వేల ఐ - టిమ్స్ సైతం అందించేందుకు సిద్ధమవుతోంది. వీటి ద్వారా ప్రయాణికులకు ఛార్జీల చెల్లింపు సులభం అవుతుంది.
'మహాలక్ష్మి' పథకం కింద స్మార్ట్ కార్డులు
సిటీ, పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుతం కండక్టర్లు సాధారణ టిమ్‌లనే టికెట్ల జారీకి ఉపయోగిస్తున్నారు. వీటిలో నగదుతోనే టికెట్ల చెల్లింపులు చేయాల్సి వస్తోంది. అయితే, కొత్తగా ప్రవేశపెట్టనున్న ఐ - టిమ్స్‌తో డెబిట్ కార్డులు, క్యూఆర్ కోడ్ స్కాన్‌తో యూపీఐ చెల్లింపులు చెయ్యొచ్చు. టీజీఎస్ఆర్టీసీకి 9 వేల పైచిలుకు బస్సులు ఉండగా.. ప్రతిరోజూ సుమారు 55 లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అటు, ఉచిత బస్సు ప్రయాణం 'మహాలక్ష్మి' పథకంతో (Mahalakshmi Scheme) ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం వీరి ఆధార్ కార్డు చూసి జీరో టిెకెట్లు జారీ చేస్తుండగా.. త్వరలోనే వారికి స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిని స్వైప్ చేసి జీరో కార్డులు పొందే ఛాన్స్ ఉంటుంది.
ఆ సమాచారమంతా క్షణాల్లో..
డిజిటల్ పద్ధతిలో చెల్లింపుల విధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ బస్సులు సాయంత్రం డిపోనకు వచ్చి తర్వాతే ఓ సర్వీసు నుంచి ఎంత ఆదాయం వచ్చిందన్నది అధికారులకు తెలిసే పరిస్థితి లేదు. కానీ, ఐ టిమ్స్‌తో బస్సు సర్వీసు కదలికలు, సిబ్బంది పనితీరు, ఆదాయం తదితర వివరాలన్నీ అధికారుల కళ్ల ముందుంటాయి. రద్దీ రూట్లు, రద్దీ లేని మార్గాల వివరాలను తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా కండక్టర్లతో మాట్లాడి ప్రయాణికుల సంఖ్య పెరిగేలా వారికి తగిన సూచనలివ్వొచ్చు.
పైలట్ ప్రాజెక్టుగా..
భాగ్యనగరంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్ సిటీ బస్సులకు ఐ - టిమ్స్ ఇచ్చారు. బండ్లగూడ డిపోలో 74 బస్సులకు 150 టిమ్స్ ఇచ్చారు. కాగా, హైదరాబాద్ నుంచి బెంగుళూరు, తిరుపతి, విశాఖ వంటి దూర ప్రాంత సర్వీసుల్లో ఇవి ఇప్పటికే వాడకంలో ఉన్నాయి. ఒక్కో ఐ టిమ్‌ను జీఎస్టీతో కలిపి రూ.9,200 కు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలైతే.. ప్రయాణికులకు టికెట్ డబ్బుల చెల్లింపు మరింత సులభతరం అవుతుంది.
Also Read: Indian Railways: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన