Dog Park in Warangal: పార్క్.. ఈ పేరు వినగానే మనస్సుకు ఆహ్లాదం కలిగించే వాతావరణం, సాయంత్రం పూట పక్షుల కిలకిలారావాలు, ప్రశాంతమైన పరిసరాలు మనకు గుర్తొస్తాయి. అయితే, ఇప్పటివరకూ మనం పబ్లిక్ పార్కులు లేదా పిల్లల కోసం చిల్డ్రన్స్ పార్కుల గురించే విన్నాం. కానీ, పెంపుడు కుక్కల కోసం కూడా ఓ పార్కు ఉంది. అదేంటీ కుక్కలకు కూడా పార్కా.! అంటూ ఆశ్చర్యపోతున్నారా.? నిజమండీ. కుక్కల కోసం స్పెషల్ పార్కు మాత్రమే కాకుండా అవి సేద తీరేందుకు కొన్ని ఏర్పాట్లు సైతం ఇందులో ఉన్నాయి. ఓరుగల్లు నగరంలో ఏర్పాటైన ఈ డాగ్స్ పార్క్ విశేషాలివే.


కుక్కల కోసం సకల సౌకర్యాలు


వరంగల్ బాలసముద్రంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 2021లో ఈ పెట్ పార్కును ఏర్పాటు చేశారు. అప్పటి నగర మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య పట్టణ ప్రగతిలో భాగంగా రూ.78 లక్షలతో దీన్ని ఏర్పాటు చేశారు. పెంపుడు కుక్కలు సేద తీరడం కోసం వాకింగ్ ట్రాక్, ఆట వస్తువులు ఇందులో అందుబాటులో ఉన్నాయి. పెంపుడు కుక్కల యజమానులు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకూ సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకూ యజమానులు తమ పెంపుడు కుక్కలతో డాగ్ పార్కుకు వచ్చి వాటికి వాకింగ్, జంపింగ్ చేయించడం, ఉయ్యాలలో ఊగించడం వంటివి చేస్తుంటారు. వాటిని ముద్దు ముద్దు పేర్లతో పిలుస్తూ ఆడిస్తూ ఉంటారు. దాదాపు అన్ని రకాల పెంపుడు కుక్కలను ఈ పార్కుకు తీసుకొస్తారని అక్కడి సిబ్బంది తెలిపారు. వరంగల్ నగరంలో దాదాపు 8 వేల పెంపుడు కుక్కలు ఉండగా, వాటితో పాటు 80 డాగ్ ఫార్మ్స్ సైతం డాగ్స్ ప్రేమికులకు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ లో మాత్రమే ఇలాంటి కుక్కల పార్క్ అందుబాటులో ఉంది.


మరో ప్రత్యేకత ఏంటంటే.?


ఈ డాగ్ పార్కులో మరో ప్రత్యేకత కూడా ఉంది. పెంపుడు కుక్కలను ఇక్కడికి తీసుకువచ్చే యజమానులు వారితో వచ్చే పిల్లల కోసం కూడా ఓపెన్ జిమ్, షటిల్ కోర్టు, ఆట వస్తువులను అందుబాటలో ఉంచారు. కుక్కలతో ఉత్సాహంగా గడుపుతూ వారు కూడా ఆటలాడి మనస్సును ఆహ్లాదం చేసుకోవచ్చు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఉద్యానవన శాఖ ఈ డాగ్ పార్కును పర్యవేక్షిస్తోంది. అయితే, ఈ పార్కుకు కేవలం స్వీపర్ తప్ప నైట్ వాచ్ మెన్ కూడా లేరని, దీంతో పార్కు లోపలి ఆట వస్తువులను కొందరు గుర్తు తెలియన వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారని పెంపుడు కుక్కల యజమానులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చాలా ఆట వస్తువులు ధ్వంసమయ్యాయని, వాటికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. అలాగే, నైట్ వాచ్ మెన్, సూపర్వైజర్ సిబ్బందిని నియమిస్తే ఇంకా బాగుంటుందని పేర్కొంటున్నారు.


Also Read: Viral Video: భారీ కాన్వాయ్‌తో తిరుగుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు- వైరల్‌గా మారుతున్న వీడియో