నూతన పార్లమెంటు భవనం సమావేశాలక సర్వం సిద్ధమైంది. ఈరోజు నుంచి పార్లమెంటు సమావేశాలు కొత్త భవనంలోనే జరగనున్నాయి. కాబట్టి ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్లమెంటు సభ్యులు నూతన భవనంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు ప్రత్యేక కానుక ఇవ్వనుంది. వారికి భారత రాజ్యాంగ ప్రతి, పాత పార్లమెంటు, కొత్త పార్లమెంటు భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం అందించనుంది. వీటిని జనపనారతో చేసిన బ్యాగులో అమర్చి, ఆ బ్యాగులపై ఎంపీల పేర్లను కూడా ముద్రించారు. ఈ బహుమతులకు సంబంధించిన బ్యాగుల ఫొటోలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో వాటిపై నెటిజన్ల చర్చ జరుగుతోంది. 


ప్రధాని నరేంద్ర మోదీ పాత పార్లమెంటు భవనం నుంచి కొత్త పార్లమెంటు భవనానికి వెళ్లేప్పుడు చేతిలో రాజ్యాంగ ప్రతితో వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధాని వెంట మిగతా ఎంపీలు వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఎంపీలు కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనంలోని లోక్‌సభలో సమావేశం కానున్నారు. తర్వాత 2.15 గంటలకు రాజ్యసభ ఛాంబర్‌లో సమావేశం జరగనుంది. 


ఐదు రోజుల ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు సెప్టెంబరు 18 నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో జరిగాయి. ఈ సమావేశంలో మోదీతో పాటు ఇతర ఎంపీలు పాత పార్లమెంటు భవనంలో తమ ఆఖరి ఉపన్యాసాలను ఇచ్చారు. మోదీ ప్రత్యేకంగా పాత పార్లమెంటు భవనానికి సంబంధించిన 75ఏళ్ల చరిత్ర గురించి మాట్లాడారు. ఈ భవనంలో జరిగిన విజయాలు, అనుభవాలు, నేర్చుకున్న అంశాలు, జ్ఞాపకాల గురించి గుర్తుచేసుకున్నారు. 


ఈ సందర్భంగా మోదీ పండిట్‌ జవరహర్‌ లాల్‌ నెహ్రూను తలుచుకున్నారు. ఆయన చేసిన చరిత్రాత్మక ప్రసంగం దేశంలో ఎన్నికైన నేతలలో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, పార్టీలు ఏర్పడతాయి, విడిపోతాయి, కానీ దేశం అలాగే ఉండాలని అని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మాట్లాడిన పార్లమెంటు ఇదే అని చెప్పారు. పార్లమెంటు భవనంపై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ.. దేశం ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. అలాగే ఇటీవల విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్, G20 ప్రెసిడెన్సీని మోదీ హైలెట్‌ చెస్తూ ప్రసంగించారు.  


కొత్త పార్లమెంటులో తొలి బిల్లుగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు లోక్‌ సభ, రాజ్య సభల్లో ఆమోదం లభిస్తే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ దక్కుతుంది. లోక్‌సభ, రాష్ట్రాల్లోని శాసనసభల్లోని మొత్తం సీట్లలో 33 శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీన్ని ఈ సమావేశాల్లో క్లియర్ చేసేందుకు బీజేపీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. 


సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష కూటమి సహా ఎన్డీయే నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగ్గా, I.N.D.I.A. నాయకులే కాకుండా ఎన్డీయే నేతలు కూడా మద్దతుగా నిలిచారు. దీన్ని బట్టి ఈ బిల్లు పార్లమెంట్‌లో నెగ్గడం పెద్ద కష్టం కాదన్నది స్పష్టమైంది.