CM Jagan News: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈక్రమంలోనే ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పర్తి చేశారు. అయితే ఈరోజు ఉదయం 6.20 గంటలకు సీఎం జగన్ శ్రీవారి ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం 8.50 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడి నుంచి కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుంటారు. అక్కడ డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజక వర్గాలకు తాగు, సాగు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన 77 చెరువులను కృష్ణా జలాలతో నింపే పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగానే కృష్ణగిరి మండలం ఆలంకొండకు వెళ్లనున్నారు. అక్కడ పంప్ హౌస్ లో హంద్రీనీవా నీటిని చెరువులకు ఎత్తిపోసే మోటార్లను స్విచ్ ఆన్ చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నంద్యాల జిల్లా డోన్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. 


ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్



శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన సోమ‌వారం రాత్రి (సెప్టెంబరు 18) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమ‌న క‌రుణాక‌ర‌ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి ఎవి.ధ‌ర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళంకారీ చిత్రపటాన్ని అందజేశారు.


ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, రోజా, టీటీడీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర‌ రెడ్డి, బోర్డు సభ్యులు యానాదయ్య, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రహ్మణ్యం, భరత్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, బియ్యపు మధుసూదన్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, మధుసూదన్ యాదవ్, ఈవో ఏవీ. ధర్మారెడ్డి, కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, జాయింట్ కలెక్టర్ డీకే.బాలాజి, జేఈవోలు సదా భార్గవి, వీర‌బ్ర‌హ్మం, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరిత‌, సీవీఎస్ఓ న‌ర‌సింహ‌కిషోర్, ఎస్పీ  పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


జగన్మోహన్ రెడ్డి తిరుపతి తిరుమలలో రెండు రోజుల పర్యటించనున్నారు. తిరుమలకు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి పద్మావతి అతిధి గృహం వద్ద టీటీడీ చైర్మన్ భుమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ అధికారులు పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు.. అనంతరం మర్యాద పూర్వకంగా పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అర్చకులు జగన్ మోహన్ రెడ్డిని కలిసి శాలువతో సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం పద్మావతి గృహంలో నుంచి సాంప్రదాయ వస్త్రం ధరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు బేడీ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.


Read Also: Salakatla Brahmotsavalu: తిరుమలలో వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, భక్తులకు కీలక సూచనలు ఇవే