ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు సోమ‌వారం సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్యన మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభం అయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ రామ‌కృష్ణ దీక్షితులు కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.


ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఏవీ.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి తదితరులు పాల్గొన్నారు.


భక్తులకు టీటీడీ సూచనలు ఇవీ


శ్రీ వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలాలో భాగంగా గరుడసేవ రోజున తిరుమలకు వచ్చు భక్తుల వాహనాలకు టీటీడీ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వాహనాలకు పాసులు పొంది తిరుమలకు రావాలి. వాహనాల పాసులు పొందిన భక్తులకు మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. తిరుమలలో రద్దీని బట్టి ఆయా సమయాలలో మార్పులు కూడా ఉంటాయి.


తిరుపతి జిల్లా పోలీస్ వారి విజ్ఞప్తి


తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవ రోజున ప్రజలు, భక్తులు, యాత్రికులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. స్వల్పకాల ట్రాఫిక్ మళ్లింపును గమనించి ప్రత్యామ మార్గాలను ఉపయోగించుకోవాలని, అలాగే ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాలను ఉపయోగించుకోవాలని ప్రజలకు, భక్తులకు తిరుపతి పోలీసులు విజ్ఞప్తి చేశారు.


వాహనాల పాసులు, ట్రాఫిక్ మళ్లింపు వివరాలు


శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 22వ తేదీన జరిగే గరుడోత్సవానికి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఈ కింద తెలియపరిచిన ప్రదేశాలలో ప్రత్యేకమైన పాసులను టీటీడీ వారు ఇవ్వడం జరుగుతుంది.


1. బెంగళూరు, చిత్తూరు నుండి వచ్చే వాహనాలకు పల్లి దగ్గర పాసులు ఇవ్వడం జరుగుతుంది.
 
2. మదనపల్లి నుంచి వచ్చే వాహనాలకు KMM కాలేజ్ దగ్గర పాసులు ఇవ్వడం జరుగుతుంది.


3. చెన్నై, పుత్తూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు వడమాల పేట టోల్ ప్లాజా దగ్గర పాసులు ఇవ్వడం జరుగుతుంది.


4. కడప వైపు నుంచి వచ్చే వాహనదారులకు కుక్కల దొడ్డి దగ్గర పాసులు ఇవ్వడం జరుగుతుంది.


5. నెల్లూరు, శ్రీకాళహస్తి వైపు నుంచి వచ్చే వాహనదారులకు మల్లవరం పెట్రోల్ బంక్ పక్కన పాసులు ఇవ్వడం జరుగుతుంది.


6. తిరుపతి పట్టణ ప్రజలకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కరకంబాడి ఎస్.వి. ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద వాహనదారులకు పాసులు ఇవ్వడం జరుగుతుంది.


22వ తేదీ గరుడోత్సవ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు ఇలా


ముఖ్యంగా గరుడోత్సవం రోజు తిరుమలలో వాహనాల రద్దీని బట్టి చర్లోపల్లి జంక్షన్ వద్ద, నంది సర్కిల్ వద్ద బ్లాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టౌన్ క్లబ్బు వైపు, యూనివర్సిటీ, అన్నారావు సర్కిల్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. గరుడసేవ సందర్భంగా 21వ తేదీ మధ్యాహ్నం నుంచి ద్విచక్ర వాహనాలు తిరుమలకు అనుమతి లేనందున నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలలోనే ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయాలి.


ద్విచక్ర వాహన పార్కింగ్ ప్రాంతాలు ఇవీ 


1. ఓల్డ్ చెక్ పాయింట్ హరే రామ హరే కృష్ణ పక్కన ఉన్న గ్రౌండ్‌లో, ఎస్వీ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న మున్సిపల్ గ్రౌండ్ లో మాత్రమే పార్కింగ్స్‌ చేయాలని సూచించారు. ప్రజలు పైవిషయాన్ని గమనించి, మీ ప్రయాణ వేళల్లో తగిన మార్పు చేసుకొని, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసు వారికి సహకరించాలని సూచించారు.