తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. అన్నివర్గాల ప్రజలు చంద్రబాబు అరెస్టును తప్పుపడుతున్నారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు అక్రమ అరెస్టును ఖండిస్తున్నారు. ఇన్వెంటస్ కేపిటల్ పార్టనర్స్ ఎండీ కన్వల్ రేఖి, లెక్సిజన్ ఫౌండర్ మేనేజింగ్ పార్టనర్ విజయ్ సాంబమూర్తి, హైటెక్ లీడర్ దీపక్ భగత్...చంద్రబాబు అరెస్టును తప్పుపట్టారు. మహారాష్ట్రలో ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలనుకున్న సమయంలో... చంద్రబాబు హైదరాబాద్ తీసుకొచ్చారని కేపిటల్ పార్టనర్స్ ఎండీ కన్వల్ రేఖి వెల్లడించారు. శివసేన 50శాతం సీట్లు స్థానికుల ఇవ్వాలని డిమాండ్ చేసిందని...అదే సమయంలో చంద్రబాబు ఐఎస్‌బీ ఏర్పాటుకు ఎంతో చొరవ చూపారని అన్నారు. టెక్నాలజీకి హైదరాబాద్ ను కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని గుర్తు చేశారు. 


పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎయిర్ పోర్టు నిర్మించేలా చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని లెక్సిజన్  ఫౌండర్, మేనేజింగ్ పార్ట్ నర్ విజయ్ సాంబమూర్తి తెలిపారు. చంద్రబాబు చొరవ తీసుకొని జీఎంఆర్ కంపెనీని ఒప్పించి...శంషాబాద్ లో ఎయిర్ పోర్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. యునిక్స్ డెవలప్ మెంట్ ను స్థాపించాలనుకున్న సమయంలో... నోయిడా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రాంతాలను తిరిగామన్నారు హైటెక్ లీడర్ దీపక్ భగత్. చంద్రబాబు ఇచ్చిన ప్రెజెంటేషన్ తో తమకు మైండ్ బ్లాంక్ అయిందని, ఆ తర్వాత యునిక్స్ డెవలప్ మెంట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న వారంతా...హైదరాబాద్ నుంచే జావా కోర్ కోర్సును నేర్చుకుంటున్నారని తెలిపారు. 


తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా విదేశాల్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు తెలుగు ప్రజలు ఆందోళనలు చేపట్టారు. వియ్‌ ఆర్‌ విత్‌ సీబీఎన్‌  అంటూ చంద్రబాబుకు మద్దతుగా కదంతొక్కారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ... భారీ ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నల్ల దస్తులు ధరించి నిరసనలో పాల్గొన్నారు. న్యాయం కావాలి... చంద్రబాబు విడుదల కావాలంటూ... నినాదాలు హోరెత్తించారు. అమెరికాలోని డల్లాస్‌ నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేల మంది తెలుగు ప్రజలు బయటికి వచ్చి వీధుల్లో ర్యాలీ చేశారు. జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతపట్టి నిరసనలు చేశారు వాషింగ్టన్‌లో అమెరికా పార్లమెంట్‌ సాక్షిగా తెలుగుదేశం శ్రేణులు నిరసన తెలిపాయి. ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో చంద్రబాబు మద్దతుగా ఆందోళన చేశారు. 


బెల్జియం దేశంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మేము సైతం బాబు గారికి తోడుగా' కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ బ్రసెల్స్ నగరం అటోమియం ముందు నిరసన నిర్వహించారు. అటు, అమెరికాలోని ఫిలడెల్ఫియాలోనూ పలు తెలుగు సంఘాలకు చెందిన ఎన్ ఆర్ఐలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చిన గొప్ప నేత చంద్రబాబు అని అమెరికా ప్రవాసాంధ్రులు కొనియాడారు. బ్రిటన్ లోనూ చంద్రబాబుకు సంఘీభావంగా ప్రదర్శనలు చేపట్టారు. లండన్ నగరంలో తెలుగు ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా వీధుల్లోకి వచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నినదించారు.