Spanish AI Influencer Meet Aitana: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) టెక్నాలజీతో ఉద్యోగాలు పోతున్నాయంటూ ఓ వైపు అందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఆ AI తో ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేసి లక్షలు సంపాదిస్తున్నాడు. స్పానిష్‌కి చెందిన ఈ AI ఇన్‌ఫ్లుయెన్సర్ నెలకి రూ.9 లక్షలు సంపాదిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెర్స్ మార్కెట్‌లో ఉన్నారు. మంచి కంటెంట్‌తో లక్షలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు AI ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా మార్కెట్‌లోకి వచ్చేశాయి. అందుకు ఉదాహరణే ఈ Spanish AI Influencer. పేరు మీట్ అయిటానా (Meet Aitana). ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫిట్‌నెస్ లవర్ అంటూ బయోలో రాసుకుందీ AI ముద్దుగుమ్మ.
రకరకాల బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తూ బోలెండంత సంపాదించి పెడుతోంది. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ పెట్టే పోస్ట్‌లన్నీ దాదాపు పెయిడ్ ప్రమోషన్స్‌వే. ఫాలోవర్స్‌కి బ్రాండ్స్‌ని సజెస్ట్ చేస్తూ కూడా బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. చాలా కంపెనీలు ఈ AI ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఉన్న ఫాలోయింగ్ చూసి తమ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేసుకునేందుకు ఎగబడుతున్నాయి. Euronews వెల్లడించిన వివరాల ప్రకారం ఇలా ఈ యాడ్స్, ప్రమోషన్స్‌తో నెలకి 10 వేల యూరోలు సంపాదిస్తోంది మీట్. అంటే మన కరెన్సీలో రూ.9 లక్షలు. Clueless అనే సంస్థ ఓనర్ రూబన్ క్రూజ్ (Ruben Cruz) ఈ AI ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేశాడు.
నిజానికి తమ కంపెనీని ప్రమోట్ చేసుకునేందుకు క్లూలెస్ సంస్థ ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై ఆధారపడింది. కాకపోతే ప్లాన్ ప్రకారం వాళ్లు కంటెంట్ ఇవ్వకపోవడం, ఇబ్బంది పెట్టడం లాంటి కారణాల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు క్రూజ్. అప్పుడే సొంతగా ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని తయారు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. సొంతగా ఓ మోడల్‌ని తయారు చేసుకుని ఆ మోడల్ ద్వారా బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకోవాలని అనుకున్నారు. అలా వచ్చిన ఆలోచనే ఇప్పుడు లక్షలు తెచ్చి పెడుతోంది. చాలా కంపెనీలు ఇలా సొంతగా AI Model ని క్రియేట్ చేసుకునేందుకు క్రూజ్‌నే సంప్రదిస్తున్నాయి.