Heatwave In Europe: 


వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి 


స్పెయిన్‌లో వేడిగాలులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. మొత్తం ఐరోపా అధిక ఉష్ణోగ్రతలతో ఉడికిపోతోంది. అడువులు తగలబడి పోతున్నాయి. ఫ్రాన్స్‌, స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్, బ్రిటన్‌లలో వేడిగాలులు తీవ్రంగా ఉన్నాయి. వేలాది మంది ప్రజలు ఈ వేడిని తట్టుకోలేక సతమత మవుతున్నారు. పోర్చుగల్‌లో అత్యధికంగా 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక స్పెయిన్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పది రోజులుగా వడగాలులు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ పది రోజుల్లోనే ఈ ధాటికి తట్టుకోలేక 500 మంది మృతి చెందినట్టు స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే క్లైమేట్ ఎమర్జెన్సీ విధించారు. వెస్టర్న్ యూరప్‌లో అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. గతంతో పోల్చుకుంటే వడగాలుల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య పెరిగిందని స్పెయిన్ ప్రభుత్వం చెబుతోంది. స్పెయిన్, పోర్చుగల్‌లో మొత్తంగా 17వందల మంది వడగాలుల ధాటికి మృతి చెందారని లెక్కలు చెబుతున్నాయి. మరో వారం రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అటు యూకేలోనూ ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. అక్కడ కూడా ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని యూకే వాతావరణ విభాగం పేర్కొంది. ఇప్పటి వరకూ యూకేలో అత్యధిక ఉష్ణోగ్రతలు 2019లో రికార్డయ్యాయి. ఆ ఏడాది టెంపరేచర్లు ఏకంగా 38.7 డిగ్రీస్ సెల్సియస్ దాటింది. కేంబ్రిడ్డ్‌ బొటానిక్ గార్డెన్‌లో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే వేడి కొనసాగితే ప్రజలకు ఆరోగ్య సమస్యలు రావటంతో పాటు ప్రాణానికే ప్రమాదమని అంటున్నారు అక్కడి నిపుణులు.