అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్షయాన సంస్థ స్పేస్​ఎక్స్ మూడు రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించి భూమికి సురక్షితంగా చేరుకుంది. స్పేస్ ఎక్స్ వాహక నౌక డ్రాగన్‌ 'స్పేస్‌ క్యాప్సుల్‌' అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఏడు గంటలకు ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో దిగింది. అపర కుబేరుడు జేర్డ్‌ ఇజాక్‌మన్‌ నేతృత్వంలో ఈ రోదసి యాత్ర సాగింది.






ఎలా సాగిందంటే..


స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్‌ రాకెట్‌ ద్వారా 'క్రూ డ్రాగన్‌' వ్యోమనౌక నింగిలోకి వెళ్లింది. ప్రయోగించిన 10 నిమిషాలకు క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశించింది. భూమికి 575 కిలోమీటర్ల ఎత్తులోకి ఇది చేరింది.






హబుల్‌ టెలిస్కోపు ఉన్న ప్రాంతాన్నీ 'క్రూ డ్రాగన్‌' దాటివెళ్లింది. అక్కడ గంటకు 27,360 కిలోమీటర్ల వేగంతో 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టింది. ఇది ధ్వని కన్నా 22 రెట్లు ఎక్కువ వేగం. యాత్ర అనంతరం వీరి వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర జలాల్లో దిగింది.