South African Pilot:
సౌతాఫ్రికాలో ఘటన..
సౌతాఫ్రికాలో ఓ సంచలన సంఘటన జరిగింది. ఫ్లైట్ గాల్లో ఉండగా...కాక్‌పిట్‌లో కోబ్రా కనిపించింది. ఇది చూసిన పైలట్ ఒక్కసారిగా భయపడిపోయాడు. ఆ తరవాత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. ఆ పైలట్ చేసిన పనిని ఎక్స్‌పర్ట్స్ అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు ఐదేళ్లుగా పైలట్‌గా పని చేస్తున్నాడు రడోల్ఫ్ ఎరాస్మస్. ఈ క్రమంలోనే నలుగురు ప్రయాణికులతో కూడిన ఓ చిన్న ఎయిర్ క్రాఫ్ట్‌ను నడిపాడు. టేకాఫ్ అయిన కాసేపటికే తన సీట్ కింద కోబ్రాను చూశాడు. ఉన్నట్టుండి అది వెంటనే దాక్కుంది. ముందు భయపడినా ఆ తరవాత కాస్త తేరుకుని వెంటనే ల్యాండ్ చేశాడు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నాడు.
"టేకాఫ్ అయ్యే ముందే మా సిబ్బంది కోబ్రాను చూశారు. వెంటనే అలెర్ట్ అయ్యి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అది కనిపించలేదు. అది వెళ్లిపోయి ఉంటుందని లైట్ తీసుకున్నారు. సాధారణంగా నేను ట్రావెల్ చేసే సమయంలో ఓ వాటర్ బాటిల్ నా కాళ్ల దగ్గర పెట్టుకుంటాను. అది నా అలవాటు. ఉన్నట్టుండి నీళ్లు లీక్ అయినట్టు అనిపించింది. ఏమైందని కిందకు వంగి చూశాను. అప్పుడే నాకు కోబ్రా కనిపించింది. తల అటువైపు తిప్పుకుని పడుకుంది. ఒక్కసారిగా స్టన్ అయిపోయా. ప్యాసింజర్స్‌కు ఈ విషయం చెప్పాలా వద్దా అని చాలా ఆలోచించాను. చెప్పి కంగారు పెట్టడం ఎందుకని ఊరుకున్నాను. కానీ కాసేపు ఆలోచించి వాళ్లకు అంతా వివరించాను. వీలైనంత త్వరగా ఎయిర్ క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసేస్తానని చెప్పాను. వెంటనే దగ్గర్లోని ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాను. మెల్లగా ఒక్కొక్కరం బయటకు వచ్చాం. స్నేక్ క్యాచర్స్ వచ్చి చూసే సరికి మళ్లీ ఆ కోబ్రా తప్పించుకుంది"
- పైలట్
పైలట్ ఎలాంటి ఆందోళన చెందకుండా చాలా చాకచక్యంగా ల్యాండింగ్ చేయడాన్ని అధికారులు అభినందించారు. కాస్త కంగారు పడినా ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడని ప్రశంసించారు.
విమానంలో పాము..
గతేడాది డిసెంబర్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) కార్గోలో పాము కనిపించడం కలకలం రేపింది. కాలికట్ నుంచి దుబాయ్‌కు వెళ్లిన ఫ్లైట్‌లోని కార్గోలో సిబ్బందికి పాము కనిపించింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాక...కార్గోలో పాము కనిపించడం వల్ల సిబ్బంది కాస్త కంగారు పడ్డారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపిన తరవాత అగ్నిమాపక సిబ్బందికి ఈ విషయం తెలియజేశారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. హ్యాండ్‌లింగ్ స్టాఫ్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగి ఉంటుందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు. అటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధులు మాత్రం ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. విమానంలో ఇలాంటివి జరగటం ఇదే తొలిసారి కాదు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి న్యూజెర్సీకి వచ్చిన యునైటెడ్ ఫ్లైట్‌లోనూ పాము వెలుగులోకి వచ్చింది. విమాన సిబ్బంది వచ్చి ఆ పాముని పట్టుకోవడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి హానీ కలగలేదు.
Also Read: రాహుల్ గాంధీ నవ భారత మహాత్ముడు, ఇద్దరికీ చాలా పోలికలున్నాయి - కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు