Sonam Wangchuk Climate Fast: లద్దాఖ్‌లో సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న Climate Fast దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇంజనీర్‌గా, విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా సోనమ్ వాంగ్‌చుక్‌ (Sonam Wangchuk Climatefast) స్థానికంగా గుర్తింపు ఉంది. లద్దాఖ్‌కి రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ ఆయన మార్చి 6వ తేదీన సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో గడ్డకట్టుకుపోయే చలిలో నిరాహార దీక్షకు దిగారు. అప్పటి నుంచి ఈ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. హిమాలయ ప్రాంతంలో జరుగుతున్న ధ్వంసాన్ని ఆపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌తో ఈ దీక్షకు కూర్చున్నారు. మితిమీరిన పారిశ్రామికీకరణ వల్ల మంచు పర్వతాలు కరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 20 రోజులుగా ఈ దీక్ష కొనసాగుతోంది.


సుమారు 3 వేల మంది ఆయన దీక్షకి మద్దతునిచ్చారు. ఆ తరవాత రోజురోజుకీ చలి పెరుగుతున్న క్రమంలో దీక్ష విరమించాలని కోరారు. కానీ...ముందు అనుకున్నట్టుగానే మరో మూడు రోజుల పాటు కొనసాగిస్తానని తేల్చి చెప్పారు వాంగ్‌చుక్. ఇటీవల తన దీక్షకు మద్దతు తెలిపేందుకు 2 వేల మంది వచ్చారని తెలిపారు. ఇక్కడి వ్యవసాయ భూములపై ప్రభుత్వం ఆధిపత్యం లేకుండా, రైతులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు వాంగ్‌ చుక్. భారత్, పాకిస్థాన్, చైనా మధ్య లద్దాఖ్‌ నలిగిపోతోందని, అటు పర్యావరణంగానూ ఎంతో నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భౌగోళిక పరిస్థితుల కారణంగా తరచూ వరదలు, కరవుతో అల్లాడిపోతున్నట్టు వివరించారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్ష ప్రారంభించారు. 


అయితే...ఆయన దీక్ష చేస్తున్న చోట రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇటీవల ఉష్ణోగ్రత మైనస్ 6 డిగ్రీలుగా నమోదైంది. మొత్తం Himalayan Institute of Alternative Ladakh లో పని చేస్తున్న వాంగ్‌ చుక్‌ పర్యావరణ విధ్వంసాన్ని నిరసిస్తున్నారు. ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. X వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. 


"నేను దీక్ష ప్రారంభించి 20 రోజులు దాటింది. దాదాపు 3 వేల మంది నాతో పాటు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వైఖరి సరికాదు. లద్దాఖ్‌లో దాదాపు 90% మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. 20 రోజులుగా ఏమీ తినకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి ఈ స్థాయిలో మద్దతు రావడం చాలా గొప్ప విషయం"


- వాంగ్‌చుక్, ఇంజనీర్