Gurpatwant Pannun on Kejriwal: ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ ఆప్ పై (Gurpatwant Singh Pannun) సంచలన ఆరోపణలు చేశాడు. 2014 నుంచి 2022 మధ్య కాలంలో ఖలిస్థానీ గ్రూప్‌ల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.133 కోట్ల నిధులు అందాయని వెల్లడించాడు. తమకు ఆర్థిక సాయం అందిస్తే అందుకు బదులుగా టెర్రరిస్ట్ దేవీందర్ పాల్ సింగ్ భుల్లార్ (Devinder Pal Singh Bhullar)ని విడుదల చేస్తామని డీల్ కుదుర్చుకున్నట్టు సంచలన విషయం చెప్పాడు. 1993 ఢిల్లీ బాంబు పేలుడు కేసులో భుల్లార్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా...31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ టెర్రరిస్ట్‌ని విడిచిపెడతామని కేజ్రీవాల్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు పన్నున్ ఆరోపించాడు. అటు అమెరికాతో పాటు కెనడాలోనూ పౌరసత్వం ఉన్న గురుపత్వంత్...సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఈ సంచలన విషయాలు చెప్పాడు. Sikhs For Justice చీఫ్‌గా కెనడా నుంచి ఖలిస్థాన్ వేర్పాటువాదాన్ని ప్రేరేపిస్తున్నాడు. కెనడా సహా పలు దేశాల్లో ఆందోళనలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన ఈ సమయంలో వీడియో విడుదల చేసి సంచలనం సృష్టించాడు. 2014లో అరవింద్ కేజ్రీవాల్, ఖలిస్థాన్ మద్దతుదారులు కొందరు న్యూయార్క్‌లోని రిచ్‌మండ్ హాల్‌లో గురుద్వారలో భేటీ అయ్యారని, అక్కడే ఆర్థిక సాయం అడిగాడని చెప్పాడు గురుపత్వంత్.
నిజానికి ఇలా కేజ్రీవాల్‌పై పన్నున్ ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఖలిస్థాన్ గ్రూప్‌ల నుంచి ఆప్‌కి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని గతంలోనూ చెప్పాడు. కేజ్రీవాల్‌పైనే కాదు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పైనా ఇవే ఆరోపణలు చేశాడు. కెనడా, అమెరికాకి చెందిన ఖలిస్థాన్ గ్రూప్‌ల నుంచి వీళ్లకి పెద్ద ఎత్తు నిధులు అందినట్టు చెప్పాడు. పంజాబ్‌లో కొంత మంది ఖలిస్థాన్ వేర్పాటువాదుల్ని అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాళ్లని విడుదల చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తరవాత ఆ పిటిషన్‌ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈడీ అరెస్ట్ అక్రమం అని, తక్షణమే తనను విడుదల చేయాలని పిటిషన్‌లో ప్రస్తావించారు. తాను త్వరలోనే బయటకు వచ్చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు కేజ్రీవాల్. ఎన్నికల ముందు కావాలనే బీజేపీ ఇలా కుట్ర చేసిందని మండి పడ్డారు. జైల్‌లో నుంచే పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎక్కడ ఉన్నా తన జీవితం దేశ సేవకే అంకితం అని వెల్లడించారు. కేజ్రీవాల్ తరపున లీగల్ టీమ్ ఆయనను బయటకు తీసుకురావడానికి అన్ని దారులూ వెతుకుతున్నారు. ఈడీ మాత్రం తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని చెబుతోంది. లిక్కర్ పాలసీ స్కామ్ ప్రధాన సూత్రధారి కేజ్రీవాలేనని ఇప్పటికే కోర్టులో వెల్లడించింది.
Also Read: Bengaluru Water Crisis: నీటి వృథాపై బెంగళూరు అధికారులు సీరియస్, రూ.లక్ష జరిమానాలు వసూలు