Solar Eclipse Effect: సూర్యగ్రహణం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నింటినీ మూసివేశారు. కానీ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని మాత్రమే తెరిచి ఉంచుతారు. తిరుమల శ్రీ‌వారి ఆల‌యాన్ని 12 గంటల పాటు మూసివేయనున్నారు. అదే విధంగా న‌వంబర్ 8న చంద్ర గ్రహ‌ణం కాబట్టి ఆరోజు కూడా ఆలయం మూసివేసి ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. నేటి సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. అనంత‌రం స‌ర్వద‌ర్శనం భ‌క్తుల‌ను మాత్రమే అనుమ‌తిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు.


సూర్య గ్రహణానికి 9 గంటలు మునుపే ఆలయాన్ని మూసి వేయడం ఆచారంగా వస్తోంది. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రోజుల్లో కచ్చితంగా 12 గంటల పాటు ఆలయాన్ని మూసి ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. ఈ రోజుల్లో ఆలయంలో శుద్ధి నిర్వహించిన తరువాత స‌ర్వద‌ర్శనం భ‌క్తుల‌ను మాత్రమే అనుమ‌తి ఇస్తారు. ఇదే విషయాన్ని టీటీడీ అధికారులు భక్తులకు తెలిపారు. గ్రహణం కారణంగా స్వామి వారి ఆలయాన్ని మూసివేయడంతో తిరుమలకి వచ్చే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది. గ్రహ‌ణ స‌మ‌యంలో అన్నప్రసాద వితరణ రద్దు చేస్తారు.


తిరుచానూరు పద్మావతి ఆలయం.. 


తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సూర్యగ్రహణం కారణంగా ఆలయ అధికారులు మూసివేశారు. గ్రహణానికి తొమ్మిది గంటల ముందే ఆలయ నిబంధన అనుగుణంగా తలుపులు మూసివేశారు. తిరిగి రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తెరిచి ఆలయ శుద్ది, పుణ్యాహవచనం నిర్వహించిన అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత భక్తులను అనుమతించనున్నారు. 


వేములవాడ రాజన్న ఆలయం మూసివేత..


ఈరోజు సూర్య గ్రహణాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు మూసి వేశారు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఆలయ తెరవబోమని అధికారులు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు సంప్రోక్షణ జరిపిన తర్వాత ఆలయాన్ని తెరుస్తామన్నారు. మహా నివేదన, ప్రదోషకాల పూజ, నిర్వహించిన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తారు. 


భద్రాద్రి రామయ్య ఆలయం కూడా..


ఈరోజు  పాక్షిక సూర్య గ్రహణం సందర్భంగా ఉదయం 10 గంటలకు భద్రాచలం రామచంద్ర ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ విషయాన్ని ఆలయ ఈఓ శివాజీ తెలిపారు. గ్రహణం అనంతరం ఈరోజు రాత్రి 7.15 నిముషాలకు రామాలయం తలుపులు తెరచి శుద్ధి కార్యక్రమాలు, సంప్రోక్షణ జరిపిస్తామన్నారు. తిరిగి రేపు తెల్లవారుజాము నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తామన్నారు. 


గ్రహణ సమయంలోనూ తెరిచి ఉండనున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం..


గ్రహణ సమయంలోనూ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని తెరిచే ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గ్రహణ సమయంలో తెరిచి ఉంచే ఒకే ఒక్క ఆలయం.. శ్రీకాళ హస్తీశ్వర ఆలయం. యథావిధిగా అభిషేకాలు, రాహుకేతు పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులందరికీ దర్శనం కల్పిస్తామన్నారు. గ్రహణం సందర్భంగా స్పర్శ కాల సమయంలో అంటే సాయంత్రం 5.11 గంటలకు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి విశేష శాంతి అభిషేకం నిర్వహించబోతున్నారు. అనంతరం నైవేద్యం, దీపారాధన సమర్పించబోతున్నట్లు ఆలయ అర్చకులు చెప్పారు.