Snakebites kill more Indians than malaria  dengue : భారత్‌లో ఏడాదికి సగటున యాభై వేల మంది వరకూ పాముకాట్లతో చనిపోతున్నారని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. నిజానికి ఈ సంఖ్య యాభై ఎనిమిది వేల వరకూ ఉంటుందని వివిధ రకాల అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు పాము కాట్ల వల్ల చనిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉండేదంటే కాస్త సహజంగా ఉండేది..కానీ ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగింది. వైద్య సౌకర్యాలు పెరిగాయి. అయినప్పటికీ ఇలా వేల మంది చనిపోతూండటం మాత్రం విషాదంగానే కనిపిస్తోంది. 


పాము కాట్లకు ఆస్పత్రికి కాకుండా బాబాల వద్దకు వెళ్తున్న గ్రామీణ ప్రజలు                          


నిజానికి ఇలా చనిపోతున్నవారిలో 80 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే చనిపోతున్నారు. దీనికి కారణం ప్రజల్లో చైతన్యం లేకపోవడమేనని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఉత్తర భారతంలోని అనేక కుటుంబాలు వ్యతిరేకంగా ఉంటాయి. వారు తమ ఊళ్లలోనో.. పక్క ఊళ్లలోనే ఉన్న బాబాల వద్దకూ తీసుకెళ్తూంటారు. వారు తమకు వచ్చిన నాటు వైద్యం చేసి.. ప్రాణాల మీదకు తెస్తూంటారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్తే.. చనిపోయేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ వీరు సమీపంలో ఆస్పత్రి ఉన్నప్పటికీ.. బాబాల దగ్గరకే తీసుకు వెళ్తున్నారు. 


ప్రమాదకరం కాని పాములు కరిచినప్పుడు వైద్యం చేసి బతికించామని ప్రచారం చేసుకుంటున్న బాబాలు                 


పాముల్లో ప్రమాదకరమైనవి తక్కువే ఉంటాయి. అలాంటి ప్రమాదం  లేని పాము కరిచినప్పుడు ఈ బాబాలు ఏదో వైద్యం చేశామని బతికించామని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. దీంతో విషపూరితమైన పాములు కరిచినప్పుడు కూడా వీరు వైద్యం కోసం  బాబాల వద్దకే వెళ్తూండటంతో పరిస్థితి విషమిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పాము కాట్లపై మూఢనమ్మకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తాము  పాముకాట్ల విషయంలో వైద్యులను నమ్మబోమని చెప్పే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఈ కారణంగా  మరణాలు పెరిగిపోతున్నాయని ప్రభత్వ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.                             


చైతన్యవంతం చేసే ప్రయత్నాలు విఫలం                      


పాముుకాట్ల విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. విషపూరిత పాములు కరిచినప్పుుుడు అయిన ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే.. స్పందించేవారు చాలా తక్కువగా ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో పని చేసుకునేవారు ఎక్కువగా ఉంటారు.పాములు కూడా అలాంటి చోట్ల ఎక్కువగానే ఉంటాయి. వాటిని నిర్మూలించడం అసాధ్యం కాబట్టి.. వీలైనంత వరకూ పాము కాట్లకు గురైన వారికి వైద్యం అందించగలిగితే వేల ప్రాణాలను కాపాడవచ్చు. కానీ గ్రామీణ ప్రాంత మూఢ నమ్మకాల వల్ల ఎక్కువ ప్రాణాలు పోతున్నాయి.