Kolkata Doctor Murder Case Updates: కోల్‌కతా హత్యాచార నిందితుడి అత్త దుర్గా దేవి సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసులో సంజయ్‌ రాయ్‌తో పాటు కచ్చితంగా వేరే వ్యక్తులు ఉన్నారని తేల్చి చెబుతోంది. అతనొక్కడే ఈ పని చేశాడంటే నమ్మేలా అనిపించడం లేదని స్పష్టం చేస్తోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు కేసులో కీలకంగా మారనున్నాయి. ఇదే సమయంలో అతని ప్రవర్తన గురించీ చెప్పింది. తన కూతురిని పదేపదే వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతడిని చూస్తేనే భయం వేసేదని వివరించింది. దారుణంగా కొట్టాడని, మూడో నెల గర్భంతో ఉన్నప్పుడు కొట్టడం వల్ల అబార్షన్ అయిందని తెలిపింది. డాక్టర్‌పై హత్యాచారం చేసిన సంజయ్ రాయ్‌ని వదిలిపెట్టొద్దని, ఉరి తీయాల్సిందేనని తేల్చి చెప్పింది. 


"అతణ్ని చూస్తేనే నాకు భయం పుట్టేది. నా కూతురితో ఆరు నెలలు బాగానే ఉన్నాడు. ఆ తరవాతే నరకం చూపించాడు. పదేపదే కొట్టేవాడు. నా కూతురు మూడోనెల కడుపుతో ఉన్నప్పుడు కొట్టాడు. ఈ కారణంగానే అబార్షన్ అయింది. పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాం. ఆ తరవాత నా కూతురు ఆరోగ్యం క్షీణించింది. నేను సంపాదించేదంతా కూతురికి మందులు కొనడానికే సరిపోతోంది. ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తున్నాను. సంజయ్ మంచి వ్యక్తి కాదు. ఉరి తీయండి. ఏమైనా చేసుకోండి. హాస్పిటల్ ఘటన గురించి నేనేమీ మాట్లాడలేను. కానీ ఈ పని అతను ఒక్కడే అయితే చేసుండడు"


- నిందితుడి అత్త


ఆగస్టు 9వ తేదీన ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. అప్పటి నుంచే దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు పోలీసులు ఎదుట నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. ఏమైనా చేసుకోండి అని స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ హత్యాచార ఘటనతో ఇంకెవరికైనా సంబంధం ఉందా అన్న కోణంలో సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్‌ని మూడు రోజులుగా విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వైద్యుల భద్రత కోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఇదే సమయంలో హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్‌ని తీవ్రంగా మందలించింది. సీబీఐ వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి రిపోర్ట్ తయారు చేయాలని తేల్చి చెప్పింది. 


నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు సీబీఐ అనుమతి తెచ్చుకుంది. ఆగస్టు 18వ తేదీన ఆర్‌జీ  కార్ హాస్పిటల్‌లో ఈ ఘటన జరిగిన సెమినార్ హాల్‌లో 3D లేజర్ మ్యాపింగ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా సిట్‌ని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నెల రోజుల్లోగా పూర్తి స్థాయిలో ఓ రిపోర్ట్ సబ్మిట్ చేయనుంది. 2021 నుంచి హాస్పిటల్‌లో ఎన్నో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలూ ఉన్నాయి. వీటిపైనా సిట్‌ విచారణ చేపట్టనుంది. 


Also Read: Aruna Shanbaug: నర్స్‌పై పాశవికంగా అత్యాచారం చేసి, కుక్క గొలుసుతో గొంతు బిగించి - కోల్‌కతాకి మించిన దారుణమిది