Snake in Air India Express:


కార్గోలో పాము...


ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) కార్గోలో పాము కనిపించడం కలకలం రేపింది. కాలికట్ నుంచి దుబాయ్‌కు వెళ్లిన ఫ్లైట్‌లోని కార్గోలో సిబ్బందికి పాము కనిపించింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాక...కార్గోలో పాము కనిపించడం వల్ల సిబ్బంది కాస్త కంగారు పడ్డారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపిన తరవాత అగ్నిమాపక సిబ్బందికి ఈ విషయం తెలియజేశారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. హ్యాండ్‌లింగ్ స్టాఫ్‌ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగి ఉంటుందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు. అటు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధులు మాత్రం ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. విమానంలో ఇలాంటివి జరగటం ఇదే తొలిసారి కాదు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి న్యూజెర్సీకి వచ్చిన యునైటెడ్ ఫ్లైట్‌లోనూ పాము వెలుగులోకి వచ్చింది. విమాన సిబ్బంది వచ్చి ఆ పాముని పట్టుకోవడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి హానీ కలగలేదు. 


షూలో దూరిన కోబ్రా..


పాములు ఎప్పుడు వచ్చి ఇళ్లలో దూరుతాయో ఎవరూ కనిపెట్టలేరు. చిన్న సందు దొరికినా వచ్చేస్తాయి. ఎక్కడో దాక్కుంటాయి. ఇల్లు సర్దుతుంటేనో, అనుకోకుండానో అవి మన కంట పడతాయి. కర్ణాటకలోని మైసూరులోనూ ఇదే జరిగింది. వెచ్చగా ఉందనకుందేమో..ఓ కోబ్రా షూలో దాక్కుంది. పాములు పట్టుకునే వ్యక్తి వచ్చి దాన్ని బయటకు తీసేందుకు చాలానే కష్టపడ్డాడు. స్నేక్ హుక్‌తో షూని అలా టచ్ చేశాడో లేదో..వెంటనే పడగ విప్పి బుస కొట్టింది కోబ్రా. ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా...వైరల్ అయింది. షూ వేసుకునేందుకు చూసిన వ్యక్తి...లోపల పాముని చూసి షాక్ అయ్యాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కి కాల్ చేసి విషయం చెప్పాడు. ఆ వ్యక్తి వచ్చి షూలో నుంచి పాముని బయటకు తీశాడు. ఇలా షూలో పాము దాక్కుని అందరినీ హడలెత్తించటం ఇదే తొలిసారి కాదు. 






చెప్పుల స్టాండ్‌లో..


తన చెప్పుల స్టాండులో నుంచి షూ వేసుకునేందుకు వచ్చిన ఓ మహిళకు అందులో లోపల నాగుపాము ముడుచుకొని పడుకొని ఉండటం చూసి షాక్‌కు గురైంది. వెంటనే ఓ ఇనుప రాడ్‌ను షూ లోపల నెట్టడంతో నాగుపాము పడగ విప్పి మహిళను కాటు వేసేందుకు ప్రయత్నించింది. చివరికి ఎలాగోలా ఆ పామును బయటకు పంపారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద షూలో పడుకున్న నాగుపాము వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.  క్యాప్షన్‌లో వర్షాకాలంలో పలు ప్రదేశాలలో పాములు కనిపిస్తాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. షూలోపల నాగుపాము పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.