Assam-Meghalaya Border: అసోం- మేఘాలయ మధ్య మళ్లీ సరిహద్దు వివాదం రాజుకుంది. సరిహద్దులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఉద్రిక్తత వాతావరణ నెలకొనడంతో మేఘాలయ ప్రభుత్వం మంగళవారం నుంచి ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను 48 గంటలపాటు నిలిపివేసింది.
పశ్చిమ జైంతియా హిల్స్, ఈస్ట్ జైంతియా హిల్స్, ఈస్ట్ ఖాసీ హిల్స్, రి-భోయ్, ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హిల్స్, వెస్ట్ ఖాసీ హిల్స్ & సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్‌తో సహా పలు జిల్లాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.
ఇదీ జరిగింది
మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని అసోం-మేఘాలయ సరిహద్దులో అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో ఈ కాల్పులు జరిగాయి. ఈ హింసలో ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు.
అసోం అటవీ శాఖ బృందం ముక్రు ప్రాంతంలో అక్రమ కలపను తరలిస్తున్న ట్రక్కును అడ్డుకుంది. ట్రక్ తెల్లవారుజామున 3 గంటలకు మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా వైపు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారులు ఆపినప్పటికీ ట్రక్కు ముందుకు వెళ్లిందని దీంతో ఫారెస్ట్ గార్డులు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. కొంతమంది పారిపోగా డ్రైవర్, హెల్పర్ సహా మరొక వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు.
సీఎం ప్రకటన
ఈ ఘటనపై మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో మేఘాలయకు చెందిన ఐదుగురు, ఒక అసోం ఫారెస్ట్ గార్డ్ సహా మొత్తం ఆరుగురు మరణించారని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈ కేసులో మేఘాలయ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Also Read: Bengal BJP: 'డిసెంబర్ తర్వాత దీదీ సర్కార్ ఉండదు- మా దగ్గర ప్లాన్ ఉంది'