Chiru BJP Plan : మెగాస్టార్ చిరంజీవిని భారతీయ జనతా పార్టీ మెల్లగా దువ్వుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. రెండు రోజుల నుంచి బీజేపీ నేతలు చిరంజీవిని అదే పనిగా పొగుడుతున్నారు. దీనికి కారణం ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ పురస్కారం ఆయనకు లభించడమే. కేంద్రమే ఈ అవార్డు ఇచ్చిందని చెప్పుకోవడంతో పాటు మెగాస్టార్‌కు తాము అమితమైన గౌరవం ఇచ్చామన్న సంకేతాలను పంపడానికి బీజేపీ నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన మెగాస్టార్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోందా ?
చిరంజీవికి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ పురస్కారం ప్రకటించిన కేంద్రం !
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డ్ మెగాస్టార్ చిరంజీవిని వరించింది. ఈ అవార్డ్ కోసం చిరంజీవిని ఎంపికచేసినట్లు ఆదివారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో భాగంగా ఈ అవార్డ్‌ను చిరంజీవికి ప్రకటించారు.గతంలో ఈ అవార్డును ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం, రజనీకాంత్, హేమమాలిని, అమితాబ్‌బచ్చన్, సలీమ్‌ఖాన్ తదితరులు గెలుచుకున్నారు. 2013 నుంచి ఈ అవార్డులను అందజేస్తున్నారు. ఈ ఏడాదికి చిరంజీవికి ప్రకటించారు.
వెంటనే బీజేపీ నేతల వరుస అభినందనలు !
ఇలా అవార్డు ఇస్తున్నట్లుగా ప్రకటించిన తర్వాత అలా బీజేపీ నేతలు ప్రశంసల వర్షం కురిపించడం ప్రారంభించారు. చిరంజీవికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అభినందలు తెలిపారు. అక్కడ్నుంచి ఇతర బీజేపీ నేతలు ప్రారంభించారు. చివరికి ఏపీ బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కూడా అభినందనలు తెలిపారు. ఇక సునీల్ ధియోధర్ లాంటి వాళ్లు ఊరుకుంటారా ? వారు కూడా రంగంలోకి దిగారు. కింది స్థాయి బీజేపీ నేతల గురించి చెప్పాల్సిన పని లేదు. వారి హడావుడి చూస్తూంటే.. చిరంజీవి బీజేపీ నేత అయిపోయారా.. లేకపోతే బలవంతంగా కలిపేసుకుంటున్నారా అన్న డౌట్ ఇతరులకు రావడం ఖాయమే.
చిరంజీవిని తమ వాడిగా చేసుకునేందుకు బీజేపీ ఉత్సాహపడుతోందా ?
చిరంజీవిని బీజేపీ ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా చూసేందుకు ప్రయత్నిస్తోంది. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో మోదీ .. చిరంజీవి తనకు ఎంతో ఆప్తమిత్రుడన్నట్లుగా సంభాషించారు. తర్వాత కూడా ఈ పాజిటివ్ ఫీలింగ్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు అది ఇంకాస్త ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ చిరంజీవిని తమ వాడిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. అయితే ఆయనకు మద్దతుగా చిరంజీవిని కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపాలన్న ఆలోచన కూడా బీజేపీ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
ప్రత్యక్ష రాజకీయాలకూ దూరమంటున్న చిరంజీవి !
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్న చిరంజీవి.. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. తనకు ఇక ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన చాలా సార్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్‌ను ఉన్నత స్థానంలో చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి బీజేపీ ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి.