ఎన్నో రోజులుగా ప్రారంభానికి నోచుకోకుండా ఉన్న బెంగళూరులోని సర్ ఎమ్ విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్‌..ఇన్నాళ్లకు అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారికంగా దీన్ని ప్రారంభించారు. ఈ టర్మినల్ నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తైంది. అప్పుడే ప్రారంభించాలని అనుకున్నా అనుకోకుండా కొవిడ్ విపత్తు వచ్చి పడింది. ఫలితంగా రెండేళ్లుగా ఈ టర్మినల్ ఇనాగరేషన్ వాయిదా పడింది. అనుసంధాన రహదారుల నిర్మాణమూ ఆలస్యమైంది. ఈ టర్మినల్ జూన్‌ 6వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ టర్మినల్‌తో పాటు మరి కొన్ని రైల్వే ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు ప్రారంభించారు ప్రధాని మోదీ. బయప్పనహళ్లిలోని ఈ టర్మినల్‌లో ఎయిర్‌పోర్ట్‌ లాంటి వసతులుండటం ప్రత్యేకత.


ఎయిర్‌పోర్ట్‌ లాంటి సౌకర్యాలు రైల్వే టర్మినల్‌లో..


దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను నవీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. అందులో భాగంగానే ఈ టర్మినల్‌ను నిర్మించింది. 4,200 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న ఈ టర్మిన్‌ నిర్మాణానికి రూ. 314 కోట్లు ఖర్చు చేసింది. కెంపెగౌడ విమానాశ్రయంలో ఎలాంటి వసతులైతే ఉన్నాయో అవన్నీ ఈ రైల్వే టర్మినల్‌లో కనిపిస్తాయి. 7 ప్లాట్‌ఫామ్స్,ఏసీ లాబీ, 900 బైక్‌లు, 250 కార్లు పార్క్‌ చేసుకునేంత అనువైన పార్కింగ్ ప్లేస్ ఈ టర్మినల్‌లో చూడొచ్చు. సర్ ఎమ్ విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్ దేశంలోనే తొలి సెంట్రలైజ్డ్‌ ఏసీ టర్మినల్‌గా రికార్డుకెక్కింది. భవిష్యత్‌లో అన్ని రైల్వే టర్మినల్స్‌నీ ఈ తరహాలోనే తీర్చి దిద్దాలని భావిస్తోంది కేంద్రం. అందుకే ఈ టర్మినల్‌ని ఓ రిఫరెన్స్‌గా పెట్టుకుంటోంది. బెంగళూరులో ప్రజారవాణాను ప్రోత్సహించటంతో పాటు సామాజిక, ఆర్థిక పరంగానూ ఈ టర్మినల్‌ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 


ఈ టర్మినల్ ప్రత్యేకతలేంటో తెలుసా..? 


1. ఈ టర్మినల్‌లో 7 ప్లాట్‌ఫామ్స్, మూడు పిట్‌ లైన్స్, 8 స్టేబులింగ్ లైన్స్ ఉన్నాయి. రోజూ 50 రైళ్లను నడిపేందుకు అనువైన వసతులు 
సమకూర్చింది కేంద్రం. 
2. ఆరు టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేయగా, అందులో ఒక కౌంటర్‌ని దివ్యాంగుల కోసం కేటాయించారు. 
3. వీఐపీ లాంజ్‌తో పాటు వెయిటింగ్ హాల్, రియల్ టైమ్ పాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉన్నాయి. ఓ భారీ ఫుడ్‌ కోర్ట్‌నీ ఏర్పాటు చేశారు. 
 లిఫ్ట్‌లు, ర్యాంప్‌లు, సబ్‌వేలకు అనుసంధానించే మెట్ల మార్గాలు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లనూ రూపొందించారు.  
4. సైన్‌ లాంగ్వేజ్‌లో టర్మినల్‌ ప్రత్యేకతలు తెలియజేసేందుకు ప్రత్యేకంగా క్యూఐర్‌ కోడ్‌ స్కానర్లను అందుబాటులో ఉంచారు. వాటిని స్కాన్ చేయగానే ఓ వీడియో ఓపెన్ అయి, టర్మినల్ స్పెషాల్టీస్‌ని సైన్ లాంగ్వేజ్‌లో  వివరిస్తుంది. వీటితో పాటు పలు చోట్ల 
ఛార్జింగ్‌ పాయింట్లనూ ఏర్పాటు చేశారు.