Singapore Airlines Flight: వాతావరణం అనుకూలించనప్పుడు విమానాలను దారి మళ్లించడం సహజంగానే జరుగుతుంది. వాతావరణం ఏమాత్రం సహకరించనప్పుడు విమానాలను దగ్గర్లో ఉన్న విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు విమానం ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు మేఘాలు అడ్డువస్తే విమానం కుదుపులకు గురవుతుంది. అందుకే ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని విమాన సిబ్బంది సూచిస్తారు. విమానం టేకాఫ్, ల్యాండింగ్ అయినపుడు కూడా ప్రయాణికుల సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తారు. తాజాగా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (Singapore Airlines)కు చెందిన ఓ విమానంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. లండన్‌ (London) నుంచి సింగపూర్‌ (Singapore) వెళ్తున్న విమానం గాల్లో ఉండగా తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మరణించగా.. సుమారు 30 మంది గాయపడ్డారు.  


సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-300ER విమానం లండన్‌లోని హెత్‌రో ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌కు సోమవారం బయల్దేరింది. 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో కలిసి మొత్తం 229 మందితో విమానంలో ఉన్నారు.  టేకాఫ్‌ అయిన కాసేపటికి విమానం మయన్మార్ గగనతలం సమీపంలో ఎగురుతున్నప్పుడు తీవ్ర ఉష్ణమండల ఉరుములతో కూడిన తుఫాను ప్రభావంతో కుదుపులకు లోనైంది. దీంతో విమానాన్ని పైలెట్ బ్యాంకాక్‌కు మళ్లించారు. సోమవారం మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. 


ఈ సంఘటనలో ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే చనిపోయినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. ఇక ఇదే ఘటనలో మరో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు విమానయాన సంస్థ తెలిపింది. ఈ మేరకు మృతి చెందిన బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించే విషయంపై థాయ్‌లాండ్‌ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.  అలాగే తమ టీమ్‌ను బ్యాంకాక్‌కు పంపిస్తున్నట్లు తెలిపింది. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్ సిబ్బందికి సాధ్యమైనంత సహాయాన్ని అందించడమే ప్రాధాన్యమని పేర్కొంది. 






ప్రమాదం జరిగిందిలా!
ఆకాశంలో 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం మూడు నిమిషాల వ్యవధిలో 6,000 అడుగుల పడిపోయి 31,000 ఎత్తులో ప్రయాణించింది. విమానం దాదపు 10 నిమిషాల పాలు 31,000 అడుగుల ఎత్తులో ప్రయాణించింది. ఆ సమయంలో కుదుపులకు లోనై ఒక ప్రయాణికుడు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 






స్పందించిన సింగపూర్ మంత్రి
సాధారణంగా ప్రయాణికులు విమానంలో సీటు బెల్ట్ ధరించనప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. వాతావరణ రాడార్ నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకపోతే పైలట్ ప్రయాణికులను అలర్ట్ చేయలేరని వెల్లడించారు. విమానం కుదుపులకు ప్రయాణికులు కింద పడిపోయి గాయాలపాలవుతారని నిపుణులు వెల్లడించారు. ప్రమాదంపై సింగపూర్ రవాణా మంత్రి చీ హాంగ్ టాట్ స్పందించారు. ప్రయాణికులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేస్తుందని ఫేస్‌బుక్ ప్రకటనలో పేర్కొన్నారు.