Elections 2024 : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ నివేదిక నేపథ్యంలో వీరు సమావేశమయ్యారు. ఎన్నికల రోజు, అనంతరం జరిగిన హింసపై సిట్ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినందున తదుపరి చర్యల సమాలోచనలు జరిపారు. సిట్ ప్రాథమిక నివేదికపై ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సి చర్యలపై ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ దర్యాప్తులో పోలీసుల వైఫల్యాలు వెలుగు చూశాయి. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో రెండు రోజులుగా విస్తఅతంగా పర్యటించిన సిట్ బఅందాలు 6 నియోజకవర్గాల పరిధిలో తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన 33 కేసులను పరిశీలించాయి. వీటికి సంబంధించిన 150 పేజీల సమగ్ర నివేదికను సిట్ అధిపతి వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్పీ రమాదేవి సోమవారం సాయంత్రం డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు అందజేశారు. ఆయన ఈ నివేదికను ఎన్నికల సంఘానికి పంపించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో సిట్ నివేదిక కలకలం రేపుతోంది. ఈసీ నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని పోలీసుశాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.
మరో వైపు పల్నాడులో జరిగిన అల్లర్లపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. గుంటూరు విద్యానగర్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాచర్ల అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి ఎంపి మాట్లాడారు. మే 13న జరిగిన పోలింగ్ ను తక్కువ చేసేందుకు వైసిపి ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలు భారీగా తరలి వచ్చి వైసిపి కి వ్యతిరేకంగా ఓట్లు వేశారని అన్నారు. 85 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో వైసిపి తట్టుకోలేకపోతోందన్నారు. వైసిపి దాడుల్లో గాయపడినవారిలో 75 శాతం మందికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. దీనిపై తాను ఎలాంటి చర్చకైనా సిద్ధం అని, తన ఫోన్లు కూడా ఇస్తానని విచారణ చేసుకోవచ్చునని అన్నారు. మాచర్ల నియోజకవర్గం దాడులకు వైసీపీ అనుకూల పోలీసు అధికారులే కారణం అన్నారు. దాడులు జరుగుతున్నాయని చెప్పినా పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. తమ కదలికలు, చర్యల పై ఎలాంటి విచారణకైనా సిద్ధం అని వైసిపి నేతల కదలికలు, ఫోన్లను కూడా అధికారులు పరిశీలించాలని కోరారు.
పల్నాడు జిల్లా లో 150 పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరుగుతాయని ముందే చెప్పామని అన్నారు. అక్కడ అదనపు పోలీసు బలగాలు పెట్టాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. కానీ ఒక్క కానిస్టేబుల్ ను మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్ద కాపలా ఉంచారని తెలిపారు. ఎన్నికల రోజున భద్రత ఎందుకు పెట్టలేదో చెప్పాలన్నారు. సిట్ అధికారులు దీని పైనా విచారణ జరపాలన్నారు. గొడవలు జరిగినప్పటికీ పోలీస్ అధికారులు ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. పోలీస్ అధికారులు ఎవరితో ఫోన్లు మాట్లాడారో సిట్ అధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.