Shiv Sena Symbol Row:


విచారణ..


మహారాష్ట్ర రాజకీయాల వేడి ఇంకా తగ్గడం లేదు. అసలైన శివసేన ఎవరిది అన్న విషయంలో పోరాటం జరుగుతూనే ఉంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరుని, గుర్తుని ముఖ్యమంత్రి శిందే వర్గానికి కేటాయించడంపై ఉద్దవ్ థాక్రే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటీసులు ఇస్తామని స్పష్టం చేసింది. థాక్రే వర్గానికి చెందిన MLAలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తేల్చి చెప్పింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి థాక్రేకు ఊరట కలిగించాలని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ సుప్రీంకోర్టుని కోరారు. అయితే...కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు మాత్రం సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. ఈ దశలో ఈసీ ఉత్తర్వులకు స్టే విధించలేమని వెల్లడించింది. థాక్రే వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయడానికి వీల్లేదని శిందే వర్గానికి ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సంఘం ప్రస్తుతానికి కేటాయించిన పార్టీ పేరు, గుర్తుని థాక్రే వర్గం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈసీ ఈ విషయంలో చాలా పక్షపాతంగా వ్యవహరిస్తోందన్నది థాక్రే వర్గం చేస్తున్న ప్రధాన ఆరోపణ. 






ఈ క్రమంలోనే ఉద్దవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీకి చెందిన సామ్‌నా పత్రికలో ఎడిటోరియల్ రాసిన థాక్రే...వేరువేరుగా బీజేపీపై పోరాటం చేయలేమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిత్వాన్నీ ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న అంశాన్నీ ఈ సంపాదకీయంలో చర్చించారు థాక్రే. అప్పటి సంగతి అప్పుడే చూసుకుందామని స్పష్టం చేశారు. ఇది తరవాత నిర్ణయించుకుందామంటూ ప్రతిపక్షాలకు సూచించారు. 


"మనం బీజేపీపై పోరాటం చేయాలంటే ఇలా వేరువేరుగా ఉంటే అది కుదరదు. మనమంతా కలిసి మెరుపు దాడి చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ మాత్రమే ఒంటరిగా బీజేపీని ఎదుర్కోలేదు. ప్రతిపక్షాలు ఐక్యం కావడమే చాలా కీలకం" 


- సామ్నా పత్రికలో ఉద్దవ్ థాక్రే 


శివసేన పార్టీ పేరు, గుర్తుని శిందే వర్గానికి కేటాయించడంపై థాక్రే సేన తీవ్ర అసహనంతో ఉంది. ఇప్పటికే ఉద్దవ్ థాక్రే ఎన్నికల సంఘంపై మండి పడ్డారు. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఇప్పుడు మరో సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా స్పందించారు. సంచలన ఆరోపణలు చేశారు. శివసేన పార్టీ పేరు, గుర్తు దక్కించుకునేందుకు శిందే వర్గం దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇదేదో నోటి మాట కాదని. ఇది నిజమని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయని వెల్లడించారు. దేశ చరిత్రలోనే ఇలాంటిదెప్పుడూ జరగలేదని అన్నారు. 


"మా పార్టీ పేరుని, గుర్తుని దొంగిలించారు. త్వరలోనే ఆ దొంగ ఎవరో తేలిపోతుంది. మేమే స్వయంగా విచారిస్తాం. ఇందుకు కచ్చితంగా బదులు తీర్చుకుంటాం" 


 - సంజయ్ రౌత్


Also Read: UP Budget 2023: విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు,మహిళలకు ఫ్రీగా సిలిండర్లు - యూపీ బడ్జెట్‌ హైలైట్స్ ఇవే