Shiv Sena: పంజాబ్‌లో దారుణ ఘటన జరిగింది. అమృత్‌సర్‌లో శివసేన నేతపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. దీంతో శివసేన నేత సుధీర్ సూరి మృతి చెందారు.


ఇదీ జరిగింది


అమృత్‌సర్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. విరిగిన దేవుడి విగ్రహాలను ఆలయం ప్రాంగణం బయట చెత్తలో పడేయడంపై శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం నిర్వాహకుల తీరుపై నిరసనగా ఆ గుడి వద్ద బైఠాయించారు శివసేన కార్యకర్తలు.


శివసేన నేత సుధీర్ సూరి దీని గురించి పోలీసులతో మాట్లాడుతుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. సుధీర్‌ సూరిపై కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడి వారు పట్టుకున్నారు. పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. నిందితుడ్ని సందీప్ సింగ్‌గా గుర్తించారు. అతడి వద్ద ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.


మరోవైపు హిట్‌లిస్ట్‌లో ఉన్న శివసేన నేత సుధీర్‌ సూరికి ప్రభుత్వ భద్రత కూడా ఉంది. ఈ ఏడాది జులైలో ఒక మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగించారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేయగా బెయిల్‌పై విడుదలయ్యారు.