Visakhapatnam News: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారనే విపక్ష నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు (Vishnu Kumar Raju) విమర్శించారు. వ్యక్తిగత కక్ష కారణంగానే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని అరెస్ట్‌ చేశారని అన్నారు. ఆయన విషయంలో ఓ ఈఈ చేత ఫిర్యాదు ఇప్పించారని తెలిపారు? ఉన్నపళంగా రాత్రికి రాత్రి అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేసి తీసుకెళ్లిపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆయనపై ఉన్న ఈ తొందరపాటు, ఇదే ఉత్సాహం మీ బాబాయ్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు విషయంలో ఎందుకు లేదని నిలదీశారు. విశాఖపట్నంలో మీడియాతో ఆయన (Vishnu Kumar Raju) మాట్లాడారు. అయ్యన్నను అరెస్ట్‌ చేసేందుకు రెండు వందల మంది పోలీసులు ఆర్ధరాత్రి ఆయన ఇంటికి రావడం ఏంటని? మండిపడ్డారు. 


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ అరాచకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని విష్ణుకుమార్‌ రాజు (Vishnu Kumar Raju) అన్నారు. ఓ ఉగ్రవాదిని పట్టుకున్నట్లుగా ఇంటి గేట్లు బద్దలుకొట్టి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని అరెస్ట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ప్రధాని మోదీ పర్యటన ఇలా..


ఇదే సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్ (MLC Madhav) మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన వివరాలు వెల్లడించారు. ఈ నెల 11, 12 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని తెలిపారు. మొత్తం 15 పథకాలు ప్రారంభం లేదా శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. వాటిలో విశాఖ రైల్వే జోన్ కార్యాలయ శంకుస్థాపన, రాయపూర్ హైవే విస్తరణ, ఆరు లైన్ల జాతీయ రహదారి జాతికి అంకితం, ఇఎస్ఐ ఆస్పత్రి, ఐఐఎమ్, హెచ్‌పీసీఎల్ విస్తరణ ప్రారంభం వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. 12వ తేదీన ప్రధాని మోదీకి పౌర స్వాగతం ఉంటుందని అన్నారు.


ప్రధాని మోదీ 11వ తేదీన రాత్రి విశాఖపట్నానికి చేరుకుంటారని మాధవ్ తెలిపారు. 12న రోడ్ షో, సభ ఉంటాయని.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ మాధవ్ పిలుపునిచ్చారు.


‘‘వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ పర్యటనను వాళ్ల పార్టీ కార్యకలాపాలతో కలగాపులగం చేస్తున్నారు. గతంలో అల్లూరి శత జయంతిని ఇలాగే ఖరాబు చేశారు. విశాఖలో ఇప్పటికే పాలన భ్రష్టు పట్టించారు. భూ కబ్జాలు పెరిగిపోయాయి. విపక్షాల అణచివేత చట్ట విరుద్ధంగా సాగుతోంది. వీటిని ఖండిస్తున్నాము. జన సేన నేత పవన్ కల్యాణ్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కోర్టు మొట్టికాయలు వేసినా తీరు‌ మార్చుకోలేదు. పవన్ కల్యాణ్ మీద రెక్కీ దారుణం. ఆయనకు సెక్యూరిటీ పెంచాలి. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇపుడు మళ్లీ అయ్యన్న పాత్రుడిని వేధించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిన పోలీసులే తాళాలు పగలగొట్టి, గోడలు దూకీ వెళ్లటం ఏమిటి?’’ అని మాధవ్ (MLC Madhav) అన్నారు.