Pawan Kalyan : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్ల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. రహదారి విస్తరణ పనుల పేరుతో అధికారులు ఇళ్లు తొలగింపు చేపట్టారు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామంలో రైతులు స్థలం ఇచ్చారు. అందుకు వైసీపీ నేతలు కక్షగట్టి రోడ్డు విస్తరణ పేరిట ఇళ్లు తొలగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కూల్చివేతల ప్రభుత్వం త్వరలో కూలిపోతుందన్నారు. ఈ మేరకు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. వైసీపీకి అనుకూలంగా ఓటు వేసినవారే మనవాళ్లు, ఓటు వేయనివారు శత్రువులు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాక్షస రాజ్యం ఆవిష్కృతం అయిందన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన నూటికి నూరు శాతం మనవారు కాని వారిని తొక్క నార తీయండి అనే విధంగా కొనసాగుతోందన్నారు. వైసీపీకి ఓటు వేసిన 49.95 శాతం ఓటర్లకు మాత్రమే పాలకులం అనే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఇప్పటం గ్రామంలో ఘటనలు నిదర్శనం అన్నారు. రోడ్డు విస్తరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తుందని పవన్ మండిపడ్డారు.  



జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే కక్ష 


ఇప్పటం గ్రామస్తులు జనసేనకు మద్దతుదారులు కావడంతో వైసీపీ నేతలు కక్షతో ఇళ్లు కూల్చివేతకు పాల్పడ్డారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మార్చి 14న జరిగిన జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకు వైసీపీ నేతలు ఆగ్రహం ఈ చర్యలకు పాల్పడ్డారన్నారు. మార్చిలో సభ జరిగితే ఏప్రిల్ నెలలో రోడ్డు విస్తరణ పేరుతో నోటీసులు ఇచ్చారన్నారు. ఈ గ్రామం ప్రధాన రహదారికి దూరంగా ఉంటుందని, రాకపోకలు కూడా అంతగా ఉండవని పవన్ తెలిపారు. ఇప్పటికే ఊరిలో 70 అడుగుల రోడ్డు ఉందని, దానిని 120 అడుగుల రోడ్డుగా విస్తరిస్తామని చెబుతూ ఇళ్లు కూల్చివేతకు ఒడిగట్టారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి వంకతో వైసీపీ ఓటు వేయనివారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పోలీస్ బలగాలతో, జేసీబీలతో పేదల ఇళ్లు కూల్చివేశారన్నారు. కూల్చివేతలపై గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారని పవన్ తెలిపారు. 


కూలిపోయే రోజు ఎంతో దూరంలో లేదు 


వైసీపీ దుర్మార్గాన్ని అడుకునేందుకు వెళ్లిన జనసేన కార్యకర్తలు, వీర మహిళలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం గ్రామస్థుల పోరాటానికి జనసేన అండగా ఉంటుందని తెలిపారు. ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఇప్పటం గ్రామ సభలో మాట్లాడుతున్నప్పుడు కరెంట్ నిలిపివేసి వైసీపీ ప్రభుత్వ కుసంస్కారాన్ని మరోసారి నిరూపించుకున్నారని ఆరోపించారు. ఇలాంటి దుష్ట చర్యలపై జనసేన అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన వైసీపీ సర్కార్ కూలిపోయే రోజు ఎంతో దూరంలో లేదని పవన్ స్పష్టంచేశారు. ఇప్పటం వాసులకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు.