Karimnagar News: కరీంనగర్ పట్టణంలో పట్టపగలు, నడిరోడ్డుపై ఓ వ్యక్తి నుంచి 15 లక్షల రూపాయలు కొట్టేశాడో దొంగ. అంతరాష్ట్ర ముఠాకి చెందిన దొంగని కరీంనగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తా సమీపంలో రామగిరి చంద్రప్రకాష్ అనే వ్యక్తి.. తాను పని చేస్తున్న ప్రైవేటు కంపెనీకి సంబంధించిన డబ్బులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నుంచి 15 లక్షల డ్రా చేశాడు. తన తోటి ఉద్యోగి మల్లారెడ్డితో కలిసి 7 హిల్స్ మార్గం వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ తో వచ్చిన దొంగల ముఠా బైక్ పై వేగంగా వచ్చి అతని చేతుల్లో ఉన్న డబ్బు సంచిని లాక్కుని క్షణాల్లో మాయమయ్యారు. ఈ ఘటనపై అప్పట్లోనే బాధితులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే జిల్లా కేంద్రంలోని పలు ముఖ్య కార్యాలయాలకు అతి సమీపంలోని ఇలా దొంగతనం జరగడం సంచలనం సృష్టించింది.


నిందితులు యూపీకి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు..


కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీస్ కమిషనర్ సత్యనారాయణ 9 బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. అయితే సీసీ కెమెరాలు పరిశీలించగా.. దొంగల ముఠా సభ్యులు రాష్ట్రానికి చెందిన వారు కాదని గుర్తించారు. వీరు పాత నేరస్తులేనని.. చాకచక్యంగా ఇలా దొంగతనాలు చేయడంలో నైపుణ్యం కలవారని తెలిపారు. వీరంతా ఉత్తరప్రదేశ్ లోని మోరాదబాద్ కు చెందిన అంతరాష్ట్ర ముఠాకు చెందిన ధనంపాల్ సింగ్, మనీష్ అజిత్ ఠాకూర్, ఆశిష్ ప్రసాద్, మేఘగా గుర్తించారు. పంజాబ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో వీరు ఇలాంటి దొంగతనాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లినట్లు తెలుసుకున్నారు. అయితే అక్కడ పోలీసుల నిఘా పెరగడంతో తెలంగాణకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.




బంధువుల ఇంట్లో ఉండి దొంగతనానికి ప్లాన్..


హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్న తమ బంధువుల వద్దకు వచ్చి.. ఎక్కడ దొంగతనం చేయాలో ప్లాన్ చేయడం మొదలుపెట్టారు. దీనికోసం ముందుగా రెండు బైకులను బ్రోకర్ వద్ద కొన్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 29న భువనగిరిలో ఓ బైకులో పెట్టి ఉన్న 40,000 డబ్బుని, అదే నెల 30వ తేదీన కామారెడ్డిలో బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి వెళ్తున్న ఓ వ్యక్తి బైక్ డిక్కీలో నుంచి లక్షా 15 వేల రూపాయలను దోచేశారు. అలాగే 31వ తేదన సిద్దిపేటలో ఓ మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు గొలుసును చోరీ చేశారు. కొన్నాళ్లపాటు గ్యాప్ ఇచ్చి కరీంనగర్ కు వచ్చిన వీరు.. సెప్టెంబర్ 5వ తేదీన బ్యాంకు వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా 15 లక్షల డబ్బు డ్రా చేసుకొని వెళుతున్న రామగిరి చంద్రప్రకాష్ కనిపించాడు. దీంతో ఎలాగైనా అతని నుండి సొమ్మును చోరీ చేయాలని ప్లాన్ వేశారు. 


చాకచక్యంగా పట్టుకున్న స్పెషల్ టీం..


పథకం ప్రకారం వేగంగా బైక్ పై వెళ్లి అందరూ చూస్తుండగా, నడిరోడ్డుపై 15 లక్షల రూపాయలను కొట్టేశారు. ఇక వెంటనే తమ బైక్ లను హైదరాబాదులో వదిలేసి రైలు ద్వారా తమ స్వస్థలానికి వెళ్లిపోయారు. తర్వాత తమకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం సేకరించారని తెలిసి అనేక ప్రాంతాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇదే క్రమంలో ఈ నెల మూడో తేదీన ఎవరికీ అనుమానం రాకుండా హైదరాబాద్ లోని ఎన్జీవిఎస్ బస్టాండ్ లో కరీంనగర్ కి చెందిన స్పెషల్ టీం అజిత్ పాల్ ఠాకూర్ ని అరెస్టు చేశారు. గతంలోనే ఈ కేసులో ఆశిష్ ప్రసాద్, మేఘ పట్టుబడుగా వారిని ఇప్పటికే రిమాండ్ కు తరలించారు. ఇక మరో ఇద్దరు కీలక నిందితులైన ధరంపాల్ సింగ్, మనీష్, ఏక్తాలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.