Ladakh shepherds Video: భారత్‌ చైనా సరిహద్దులోని లద్దాఖ్‌లో గొర్రెల కాపరులకు, చైనా సైనికులకు మధ్య ఘర్షణ తలెత్తింది. గొర్రెల్ని కాస్తుండగా ఉన్నట్టుండి చైనా సైనికులు వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంగా...రెండు వర్గాల మధ్య కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగాక ఇక్కడికి గొర్రెల కాపరులు రావడమే మానేశారు. ఇన్నేళ్ల తరవాత మళ్లీ అక్కడికి వెళ్లారు. వెళ్లిన కాసేపటికే చైనా సైనికులు వచ్చి గొడవకు దిగారు. వాళ్లు ఎంత బెదిరించినా గొర్రెల కాపరులు బెదరలేదు. "ఇది మా నేల" అని గట్టిగా వాదించారు. గత మూడేళ్లుగా ఈ ప్రాంతంలో తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే కొన్నేళ్ల పాటు అటుగా వెళ్లలేదు గొర్రెల కాపరులు. ఈ సారి మాత్రం ధైర్యం చేసి వెళ్లడమే కాకుండా...చైనా సైనికుల ఆగడాలను ప్రతిఘటించారు. చుషుల్ కౌన్సిలర్ కాంచోక్ స్టాంజిన్ ఈ వీడియోని షేర్ చేశారు. స్థానికులు ఎంత ధైర్యంగా చైనా సైనికులను ప్రతిఘటించారో చూడండి అంటూ పోస్ట్ పెట్టారు. వాళ్ల ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. 


"తూర్పు లద్దాఖ్‌లో ఇలా స్థానికులు కూడా చైనా సైనికులను ఎదిరించగలిగే ధైర్యం ఇచ్చినందుకు సైన్యానికి థాంక్స్. వాళ్ల హక్కుల కోసం వాళ్లు గట్టిగా పోరాడుతున్నారు. పాంగాంగ్‌ సరస్సు తీరంలో గొర్రెలను కాసేందుకు వచ్చి ఇది మా నేల అని గట్టిగా చెప్పారు. ప్రజలకు ఇంత ఆత్మవిశ్వాసం ఇచ్చినందుకు, వాళ్లతో సన్నిహితంగా మెలుగుతున్నందుకు ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు. సరిహద్దు ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు"


- కాంచోక్ స్టాంజిన్, చుషుల్ కౌన్సిలర్ 




ఈ వీడియోలో కొంత మంది చైనా సైనికులతో పాటు కొన్ని సాయుధ వాహనాలు కనిపిస్తున్నాయి. గొర్రెల కాపరులు అక్కడికి రాగానే పెద్ద ఎత్తున సైరన్‌లు మోగించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారించారు. కానీ...వాళ్లు అక్కడి నుంచి వెళ్లలేదు. భారత భూభాగంలోనే ఉన్నామని వాదించారు. ఆ తరవాత కాసేపటికి ఈ వాదన ముదిరింది. కొందరు గొర్రెల కాపరులు అక్కడే ఉన్న రాళ్లు తీసుకుని విసిరేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.