Shehbaz Sharif Elected as PM: పాకిస్థాన్‌కి ప్రధానిగా మరోసారి షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్ తరవాత దాదాపు 16 నెలల పాటు పాకిస్థాన్‌కి ప్రధానిగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ అవే బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టులో పార్లమెంట్‌ని రద్దైంది. గత నెల ఎన్నికలు జరిగాయి. కూటమిలోని పార్టీలు షెహబాజ్‌కే మరోసారి ప్రధాని బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించాయి. అంతకు ముందు జనరల్ అసెంబ్లీలో నానా రభస జరిగింది. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ఓటింగ్‌ని వ్యతిరేకించాయి. ఆ ఆందోళనల మధ్యే ఓటింగ్ జరిగింది. 201 మంది నేతలు షెహబాజ్‌ షరీఫ్‌కి అనుకూలంగా ఓటు వేశారు. మొత్తం 265 మంది ఉన్న జనరల్ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ PTI కి మద్దతునిచ్చిన 93 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నవాజ్ షరీఫ్ PML-N పార్టీ (Pakistan Muslim League-Nawaz ) 75 సీట్లు గెలుచుకుంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 52 చోట్ల విజయం సాధించింది.






నిజానికి నవాజ్ షరీఫ్‌ ప్రధానిగా ఎన్నికవుతారని అంతా ఊహించారు. కానీ...అతని సోదరుడు షెహబాజ్ షరీఫ్‌ తెరపైకి వచ్చారు. పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడం వల్ల మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపేందుకు నవాజ్ షరీఫ్ పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. కేవలం 80 సీట్లే రావడం వల్ల మిగతా పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2022లో పాకిస్థాన్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ తప్పుకున్న తరవాత ఆ బాధ్యతలు తీసుకున్నారు షెహబాజ్ షరీఫ్. దాదాపు ఏడాదిగా ఆర్థిక వ్యవస్థ పతనం అవుతున్నా...ఆ సమస్యని షెహబాజ్ చాలా పద్ధతిగా డీల్ చేశారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. IMF నుంచి బెయిల్ అవుట్ తెప్పించుకోడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని స్పష్టం చేస్తున్నారు. ప్రధాని కాక ముందు పాక్‌లోనే అతి పెద్ద ప్రావిన్స్ అయిన పంజాబ్‌కి మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు షెహబాజ్ షరీఫ్. మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరు తెచ్చుకున్నారు.


పాకిస్థాన్​ ఎన్నికల ప్రక్రియను `మదర్​ ఆఫ్ ఆల్ రిగ్గింగ్` అని మాజీ ప్రధాని, ప్ర‌స్తుతం జైల్లో ఉన్న‌ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రజల తీర్పును దోచుకున్న నాయకులు దానిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పలు కేసుల్లో దోషిగా శిక్ష ఎదుర్కొంటున్న ఇమ్రాన్​ ఖాన్​ను ఆయన సోదరి అలీమా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడి ఆమె ఇమ్రాన్ సందేశాన్నివెల్ల‌డించారు. ఇమ్రాన్ ఖాన్‌పార్టీ పీటీఐని సుప్రీంకోర్టు ర‌ద్దు చేయ‌డం.. ఎన్నిక‌ల సంఘం కూడా పోటీకి దూరంగా ఉంచ‌డం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. ఇమ్రాన్‌మ‌ద్ద‌తు దారులు ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా పోటీ చేశారు. వీరు గెలిచిన త‌ర్వాత కూడా ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌నిపించ‌లేదు. 


Also Read: BJP Candidate List 2024: బీజేపీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల, లిస్ట్‌లో ఎవరున్నారంటే?