Jharkhand News: ఝార్ఖండ్‌లో స్పెయిన్‌కి చెందిన టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డుమ్‌కా ప్రాంతంలో ఈ దారుణం జరిగినట్టు పోలసులు వెల్లడించారు. స్పెయిన్‌కి చెందిన ఓ జంట నైట్‌హాల్ట్ కోసం టెంట్‌ని బుక్ చేసుకుంది. ఆ సమయంలోనే కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్లిద్దరిపై దాడి చేశారు. భర్తని దారుణంగా కొట్టారు. ఆ తరవాత ఆమెపై 7గురు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలోనే అందిస్తామని పోలీసులు వెల్లడించారు. బంగ్లాదేశ్ నుంచి టూవీలర్‌పై వచ్చిన ఈ జంట ఝార్ఖండ్‌లో నైట్‌హాల్ట్ కోసం ఉండిపోయింది. అక్కడి నుంచి బిహార్ మీదుగా నేపాల్‌కి వెళ్లాలని అనుకున్నారు. టెంట్‌లో నిద్రిస్తున్న సమయంలో దాదాపు 7-8 మంది యువకులు వాళ్లపై దాడి చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇప్పటికే నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై ఝార్ఖండ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి దారుణాలు రాష్ట్రానికి మచ్చ తెచ్చి పెడతాయని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్యమంత్రి బన్నా గుప్తా దీనిపై స్పందించారు. తనకు ఇంకా పూర్తి వివరాలు తెలియదని, చట్టప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 


"ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. చట్టప్రకారం వాళ్లకి శిక్ష పడేలా చూస్తాం"


- బన్నా గుప్తా, రాష్ట్ర మంత్రి


ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా మండి పడింది. విదేశీ పర్యాటకులపై ఇలాంటి దారుణాలు జరిగితే ఝార్ఖండ్‌కి ఇంకెవరైనా వస్తారా అంటూ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో దళితులు, ఆదివాసీలకు భద్రత లేకుండా పోతోందని ఇప్పుడు విదేశీ పర్యాటకులకూ రక్షణ లేకుండా పోయిందని విమర్శిస్తోంది. ముఖ్యమంత్రి చంపై సోరెన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇలాంటి ఘటనలే చెబుతున్నాయని తేల్చి చెబుతోంది. పోలీసులు, ప్రభుత్వం కఠినంగా ఈ నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.