BJP Lok Sabha Candidates First List 2024: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాపై ఇన్నాళ్ల సస్పెన్స్‌కి తెర దించుతూ బీజేపీ ఫస్ట్ లిస్ట్‌ని విడుదల చేసింది. 195 అభ్యర్థులతో కూడిన ఈ జాబితాని వినోద్‌ తావడే విడుదల చేశారు. ఈ లిస్ట్‌లో మొత్తం 34 మంది మంత్రులున్నారు. 57 మంది ఓబీసీలకు అవకాశమిచ్చింది హైకమాండ్. యువతకు 47 స్థానాలు కేటాయించినట్టు వినోద్ తావడే వెల్లడించారు. ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 సీట్లు కేటాయించారు. మొత్తం అభ్యర్థుల్లో 28 మంది మహిళలకు అవకాశమిచ్చారు. బెంగాల్‌లో 20, మధ్యప్రదేశ్‌లో 24, గుజరాత్‌లో 15, రాజస్థాన్‌లో 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.


యూపీలో 51, కేరళలో 12 సీట్లు, తెలంగాణలో 9 సీట్లు, అసోంలో 11, ఝార్ఖండ్‌లో 11, ఛత్తీస్ గఢ్‌లో 11, ఢిల్లీలో 5 సీట్లు, జమ్మూ కశ్మీర్‌లో 2, ఉత్తరాఖండ్‌లో, 2, అరుణాచల్ ప్రదేశ్‌లో, గోవాలో 1, త్రిపురలో 1, అండమాన్ నికోబార్‌లో 1, డామన్ డయ్యూలో 1 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు బరిలోకి దిగనున్నారు. ఉత్తర ఢిల్లీ నుంచి మనోజ్ తివారి పోటీ చేయనున్నారు. గుజరాత్‌లోని పోర బందర్ నుంచి మన్‌సుఖ్ మాండవియ, అసోంలోని దిబ్రుఘర్ నుంచి శర్వానంద్ సోనోవాలా పోటీ చేస్తారని వినోద్ తావడే వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్ నుంచి జితేంద్ర సింగ్ పోటీ చేయనున్నారు. త్రిసూర్‌ నుంచి సురేశ్ గోపీ, పథనం తిట్ట నుంచి ఏకే ఆంటోని బరిలోకి దిగనున్నారు. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గం నుంచి జ్యోతిరాదిత్య సింధియా, విదిశా నియోజకవర్గం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయనున్నారు. 







ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచే బరిలోకి దిగనున్నారు. ఎప్పటిలాగే అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. దాదాపు 15 రోజులుగా ఈ జాబితాపై మేధోమథనం చేస్తోంది అధిష్ఠానం. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జాబితాని పూర్తిగా పరిశీలించి ఆ తరవాత ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడిదే లిస్ట్‌ని విడుదల చేశారు. ఈ సారి 370 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతోంది బీజేపీ. అంతే కాదు. NDA కూటమి 400 చోట్ల తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. 






ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫిబ్రవరి 29న రాత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాని ఫైనలైజ్ చేయడంపై చర్చించారు. అయితే..అంతకు ముందు క్షేత్రస్థాయిలో నుంచి ఒక్కో అభ్యర్థి గురించి ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంది బీజేపీ. ఇందుకు Namo Appని వినియోగించుకుంది. స్థానిక ఎంపీ పని తీరు ఎలా ఉందో చెప్పాలంటూ ఒపీనియన్ పోల్ పెట్టింది. అంతే కాదు. ఒక్కో ప్రాంతంలో ప్రజలకు ఎక్కువగా నచ్చిన ముగ్గురు నేతల పేర్లను సేకరించింది. స్థానిక ప్రజలకు ఆయా నేతలు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు..? వాళ్ల పని తీరు ఎలా ఉంది..? అనే కోణాల్లో అభిప్రాయాలు సేకరించింది.