Anant Ambani Pre Wedding Event: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 1వ తేదీన ప్రారంభమైన ఈ ఈవెంట్...మార్చి 3వ తేదీన వరకూ కొనసాగనున్నాయి. మొదటి రోజే సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. పాప్‌సింగర్ రిహాన్నా షో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ఓ బాలీవుడ్ పాటకి యాక్టింగ్‌ చేసి అందరినీ అలరించారు. అంతా సందడిగా సాగిపోతున్న వేడుకల్లో ఒక్కసారిగా అందరినీ భావోద్వేగానికి గురిచేసింది అనంత్ అంబానీ స్పీచ్. తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో ముకేశ్ అంబానీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


"నా కుటుంబం నన్ను చాలా స్పెషల్‌గా చూసింది. అయినా నా జీవితం ఏమీ పూలపాన్పు కాదు. ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాను. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ఎప్పుడూ అమ్మ, నాన్న నాకు అండగా ఉన్నారు. నాకు బాధ కలగకుండా ఉండేందుకు ఏమేం చేయాలో అన్నీ చేశారు. ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్‌గా జరుగుతోందంటే అందుకు కారణం మా అమ్మే. కొద్ది నెలలుగా రోజుకి 18 గంటల పాటు పని చేస్తోంది. ఆమె వల్లే ఇదంతా సాధ్యమైంది. థాంక్యూ అమ్మా"


- అనంత్ అంబానీ



వారం రోజుల క్రితం నుంచే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కి అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు వెయ్యి మంది అతిథులకు ఆహ్వానం అందించారు. వాళ్లందరికీ గుజరాతీ వంటకాల రుచి చూపిస్తోంది ముకేశ్ అంబానీ కుటుంబం. బిల్‌గేట్స్, మెటా సీఈవో జుకర్‌బర్గ్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్‌ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఆమీర్ ఖాన్, దీపికా పదుకొనే, రణ్‌వీర్‌ సింగ్‌ని ఆహ్వానించారు. మార్చి 1వ తేదీన పాప్ సింగర్ రిహాన్నా మ్యూజిక్ షోతో అలరించింది.