Abu Dhabi (UAE) BAPS Hindu Temple: సాధారణంగా దేవాలయానికి వెళ్లేటప్పుడు చాలామంది సంప్రదాయ దుస్తులనే ఎంపిక చేసుకుంటారు. అక్కడ మార్గదర్శకాలు కూడా అలానే ఉంటాయి. కానీ మనదేశంలో తిరుపతి లాంటి కొన్ని ఆలయాల్లో మాత్రమే సంప్రదాయ దుస్తులతోనే అడుగుపెట్టాలనే నిబంధన కఠినంగా అమలు చేస్తారు. మరికొన్ని ఆలయాల్లో దర్శనానికి భక్తులు.. వారికి నచ్చిన దుస్తులతోనే వెళ్లిపోతారు. కానీ ముస్లిం దేశంలో మొదటి హిందూ దేవాలయం అయిన అబుదాబి ఆలయంలో డ్రెస్ కోడ్, మార్గదర్శకాల విషయంలో చాలా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అబుదాబిలో తొలి దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన బాప్స్ మందిరాన్ని ప్రధాని మోదీ ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఈ ఆలయంలో సామాన్యులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. దర్శనాల నియమ నిబంధనలు, భక్తుల డ్రెస్ కోడ్‌కు సంబంధించి విడుదల చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి
- ఆలయ నిబంధనల ప్రకారం, మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి
- ఇతర వస్త్ర డిజైన్లకు అనుమతి లేదు. టైట్‌గా ఉన్న దుస్తులు, స్లీవ్‌లెస్, షార్ట్స్‌కు అనుమతించరు
- కళ్లుచెదిరేలా తళుకులీనే యాక్సెసరీలు, శబ్దాలు చేసే ఉపకరణాలనూ ఆలయంలోకి అనుమతించరు
- పెంపుడు జంతువులను ఆలయంలోకి అనుమతించరు
- బయటి ఆహారాన్ని కూడా ఆలయంలోకి తీసుకురాకూడదు
- దేవాలయం పరిసరాల్లో డ్రోన్స్ వినియోగంపై కూడా నిషేధం విధించారు
ఆలయంలోని ఆధ్యాత్మిక, ప్రశాంతమైన వాతావరణానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ ఆలయం సోమవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
Also Read: శుభ కార్యాల్లో రూ. 51, రూ. 101, రూ. 111, రూ. 1011, రూ.1111 ఎందకు ఇస్తారు?
27 ఎకరాల్లో నిర్మాణం - రూ.700 కోట్ల వ్యయం
బాప్స్ సంస్థ ఆధ్వర్యంలో అబూ మారేఖ్ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగింది. ఫిబ్రవరి 14న ప్రధాని మోదీ స్వయంగా ఈ ఆలయాన్ని ప్రారంభించారు. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేశారు. UAE లో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించారు. 2019లో UAE టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయాన్ని రూ.700 కోట్లతో 27 ఎకరాల్లో నిర్మించారు. అబుధాబి, యూఏఈ, దుబాయ్, షార్జా.. ఇలా మొత్తం ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఏడు గోపురాలను నిర్మించారు. ఆలయంలో 2 గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్యాంసులు.. ఇలా అనేక శిల్పాలను చెక్కారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద 3డీ విధానంలో ఏక శిలపై అయోధ్య రామమందిర నమూనాను రూపొందించారు. పవిత్ర గంగా యమున నదీ జలాల ప్రవాహాన్ని మరపించేలా దేవాలయం దిగువ భాగంలో కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న 20 వేల టన్నులకు పైగా పాలరాయితో.. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2 వేల మందికి పైగా శిల్పులు, కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించారు.
Also Read: తాళి,మెట్టెలు తీసేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారేమో - ఈ విషయాలు తెలుసా మరి!