భార్య అంగీకారం లేకుండా శృంగారంలో పాల్గొనడం అత్యాచారమా కాదా అన్నదానిపై పలు రాష్ట్రాల కోర్టులు విభిన్నరకాల తీర్పులు ఇస్తున్నాయి.  చత్తీస్ ఘడ్ హైకోర్టు తాజాగా  ఈ అంశంపై కీలకమైన తీర్పు ఇచ్చింది. భార్యకు ఇష్టం లేకపోయినా ఆమెతో శృంగారం చేయడం అత్యాచారం కాదని తీర్పునిచ్చింది. అయితే నిందితుడిపై మరో రకమైన అభియోగాలు మోపింది. అసహజ శృంగారానికి పాల్పడటం మాత్రం నేరంగా పేర్కొన్నది. కొద్ది రోజుల కిందట కేరళ హైకోర్టు భిన్నమైన తీర్పు ఇచ్చింది. ఆమెకు ఇష్టం లేకుండా  బలవంతంగా భర్త అయిన శృంగారానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది అత్యాచారమే అవుతుందని కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పునకు భిన్నంగా చత్తీస్ ఘడ్ కోర్టు తీర్పు ఇచ్చింది. 


భార్య సహధర్మచారణి అంత మాత్రాన...భార్య దేహాన్ని భర్త పూర్తిగా తన ఆస్తిగా భావించడం తప్పని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కేరళకు చెందిన ఓ మహిళ క్రూరత్వం కారణంగా చూపిస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను విచారమ జరిపిన ఫ్యామిలీ కోర్టు మహిళ కోరుకున్నట్లుగా విడాకులు మంజూరు చేసింది. అయితే ఇలా విడాకులు ఇవ్వడం కరెక్ట్ కాదని వాదిస్తూ.. భర్త హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణలోనే న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు.  పెళ్లి అయిన తర్వాత ఆమెకు ఇష్టం ఉన్నా లేకపోయినా భార్యతో శృంగారం చేయడం భర్త హక్కు అని సమాజం భావిస్తూ ఉంటుంది. 


గతంలో భార్యకు ఇష్టం లేకుండా శృంగారం చేసినా అది రేప్ కిందకే వస్తుందని కొన్ని కో్టులు తీర్పులు ఇచ్చాయి. అయితే.. ఈ వైవాహిక అత్యాచారాన్ని శిక్షార్హంగా చట్టంలో గుర్తించలేదు. కానీ విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం సరిపోతుందని.. హైకోర్టు స్పష్టం చేసింది. ఇష్టం లేకపోయినా శృంగారం చేసిన కారణంగా విడాకులు కోరడం సబబేనని అభిప్రాయపడుతున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది.  కొద్ది రోజుల కిందట ముంబై ఫ్యామిలీ కోర్టు కూడా  భార్యాభర్తల మ‌ధ్య బ‌ల‌వంత‌పు శృంగారం చట్టవిరుద్దం కాద‌ని తీర్పు చెప్పింది. ఆ తీర్పు కూడా చర్చనీయాంశమయింది. 
 
భార్యభర్తల మధ్య అత్యాచారం విషయంలోనే కాదు నేరుగా రేప్ విషయంలలోనూ న్యాయస్థానాల్లో భిన్నమైన తీర్పులు వస్తున్నాయి.  పురుషుడి అవయవంతో అమ్మాయి శరీరాన్ని ఎక్కడ తాకినా అది అత్యాచారం కిందకే వస్తుందని కేరళ హైకోర్టు తేల్చింది. అయితే నేరుగా తాకకపోతే అత్యాచారం కాదని మరో కేసులో న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ తీర్పు వల్ల అనేక సమస్యలు వస్తాయని కేంద్రం ఇటీవల అఫిడవిట్ దాఖలు చేసింది. గ్లౌజ్‌లు వేసుకుని రేప్ చేస్తే అత్యాచారం కిందకు రాదన్నట్లుగా తీర్పు ఉందని వాదిస్తోంది. దేశంలో కోర్టులు ఇలా అత్యాచారాల విషయంలో భిన్నమైన తీర్పులు ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది.